ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్లో భారీ జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి యువతులను రప్పించి, వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా.. వారిని గదుల్లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు దారుణమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఉద్యోగం కోసం వచ్చిన యువతుల నుంచి అడ్మిషన్ ఫీజు పేరుతో భారీగా డబ్బు వసూలు చేశారని, ఆ తర్వాత వారి చేత బలవంతంగా మోసపూరిత ఫోన్ కాల్స్ (స్కామ్ కాల్స్) చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముఠా చెర నుంచి తప్పించుకున్న యువతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిలో అజంగఢ్ ప్రాంతానికి చెందిన ఒక యువతి తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆ యువతి తండ్రి చనిపోయారని, కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో తల్లి, తమ్ముళ్ల బాధ్యతను తానే తీసుకున్నానని ఆమె తెలిపింది. దీంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న ఆమెను కొందరు సంప్రదించి, షాజహాన్పూర్లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఉందని పిలిచారు. అక్కడ వస్తువులను ప్యాకింగ్ చేయడం, జాబితా తయారు చేయడం, స్టాక్ లెక్కలు చూసుకోవడం వంటి పనులు ఉంటాయని చెప్పారు. ఇది నమ్మి ఆమె అజంగఢ్ నుంచి షాజహాన్‌పూర్‌కు వెళ్లింది. అక్కడి సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిగోహి రోడ్డు, కోటియా ఆలయం సమీపంలో ఉన్న ఆశా ఎంటర్ప్రైజెస్ ఆఫీసులో పనిలో చేరేందుకు తన దగ్గర రూ.21 వేలు వసూలు చేశారని ఆమె ఆరోపించింది. ఆ డబ్బు కట్టడం కోసం తన కుటుంబ సభ్యులు పొలం కూడా అమ్మేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కానీ, వారు హామీ ఇచ్చినట్లుగా ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదని, పైగా తనను ఓ గదిలో బంధించారని ఆ యువతి ఫిర్యాదు చేసింది. ప్రారంభంలో రెండు నుంచి నాలుగు రోజుల వరకు బయటకు వెళ్లనివ్వకుండా అక్కడే ఉంచారని, ఆ తర్వాత బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి మోసపూరిత కార్యకలాపాలకు (స్కామ్) పాల్పడాలని బలవంతం చేశారని తెలిపింది. ఇందుకు నిరాకరించినప్పుడు తనపై దాడి చేసి, చెంపదెబ్బలు కొట్టారని ఆరోపించింది. అలాగే, తన తల్లికి ఒంట్లో బాగోలేదని చెప్పి ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేశారని కూడా తెలిపింది. కొందరు యువతులకు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి లైంగిక దాడికి కూడా పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ఈ ముఠా బందీఖానాలో దాదాపు 200 మంది యువతీయువకులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. వారిలో అజంగఢ్‌కు చెందిన సుమారు 12 మంది యువతులు ప్రాణాలకు తెగించి అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చినట్లు సమాచారం. ఐదు రోజుల క్రితమే పోలీసు సూపరింటెండెంట్‌కు (ఎస్పీకి) ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది యువతులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టలేకపోతున్నారని తెలిపారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి, యువతులను బంధించి మోసాలు, లైంగిక నేరాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధితులందరినీ గుర్తించి రక్షించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది.

Leave a Reply