భారతదేశంలోని కార్పొరేట్ మరియు బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న లక్షలాది మంది మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఒక అత్యంత షాకింగ్ నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.
‘ఘోస్ట్ ఆఫ్ సైలెన్స్’ (Ghost of Silence) అనే పేరుతో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే నివేదిక ప్రకారం.. గర్భస్రావం (Miscarriage) వంటి తీవ్రమైన శారీరక, ఆరోగ్య సమస్యల కారణంగా దేశంలో సుమారు 7 కోట్లకు పైగా మహిళలు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నారు.
ఆఫీసులో ఈ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడితే ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అనే భయం, లేదా తోటి ఉద్యోగులు తమను తక్కువ చేసి మాట్లాడుతారనే ఆందోళన వల్ల.. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది మహిళలు ఈ శారీరక నరకాన్ని, మానసిక వేదనను గుండెల్లోనే దాచుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు.
నిశ్శబ్దాన్ని ఛేదించేందుకు కార్పొరేట్ ముందడుగు!
కార్పొరేట్ రంగంలో ఉన్న ఈ భయంకర వాతావరణాన్ని మార్చడానికి, ‘బ్రేక్ ద సైలెన్స్’ (Break the Silence) అనే పేరుతో జాతీయ స్థాయి అవగాహన ఉద్యమాన్ని ‘క్వెస్ట్ గ్లోబల్’ (Quest Global) సంస్థ ప్రారంభించింది. ఇది కేవలం మహిళల వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, వారి పనితీరును (Productivity) దెబ్బతీసే ఒక తీవ్రమైన కార్పొరేట్ సంక్షోభమని ఈ సంస్థ గుర్తించింది. ఈ క్రమంలోనే బాధిత మహిళా ఉద్యోగుల కోసం 24 గంటల పాటు ఉచిత మానసిక కౌన్సిలింగ్, మరియు అవసరమైన మద్దతును అందించడానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.
ఈ సామాజిక ముందడుగులో భారత్ సీరమ్స్ (Bharat Serums), కోనే (Kone), అమర రాజా (Amara Raja) వంటి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా చేతులు కలిపాయి. కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, నమ్మకమైన వాతావరణాన్ని కల్పించినప్పుడు మాత్రమే.. వారు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా తమ సమస్యలను బహిరంగంగా పంచుకోగలరని, తద్వారా ఆరోగ్యకరమైన ఆఫీస్ సంస్కృతి (Workplace Culture) ఏర్పడుతుందని ఈ నివేదిక ముఖ్య సందేశంగా పేర్కొంది.

Leave a Reply