వంటగదిలో పనులను సులభతరం చేయడానికి చాలా మంది కొత్త పద్ధతులను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో, ఒక దారానికి గుచ్చిన పూరీలను ఒకేసారి నూనెలో వేయించి తీస్తున్న ఒక వింత వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది.
సాధారణంగా పూరీలను ఒక్కొక్కటిగా వేయించడం వల్ల సమయం, శ్రమ ఎక్కువవుతాయి. దీనిని తగ్గించడానికి ‘రచన’ అనే మహిళ ఒక కొత్త ఉపాయం ఆలోచించింది. తాను చేసిన పూరీలను విడివిడిగా నూనెలో వేయకుండా, వాటన్నింటినీ ఒక దారానికి గుచ్చి, ఆ దారాన్ని పట్టుకుని ఒకేసారి వేడి నూనెలో వేసి వేయించింది.
దారాన్ని పట్టుకునే పూరీలను అటు ఇటు తిప్పుతూ సిద్ధం చేసిన ఈ పద్ధతి సమయాన్ని ఆదా చేసినప్పటికీ, ఇది ఏమాత్రం సురక్షితం కాదని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారానికి ఉండే రంగు లేదా దారంలోని పీచు పదార్థాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కొత్త ప్రయత్నాలను అభినందించినప్పటికీ, వంట విషయాల్లో ఆరోగ్యం మరియు భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
