హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని బీఆర్టీ (BRT) రోడ్డులో, ఓ మహిళా బైక్ రైడర్‌ను లగ్జరీ కార్ డ్రైవర్ వెంబడించి మరీ ఢీకొట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
రోడ్డుపై ప్రమాదకర రీతిలో చాలా దగ్గరగా కారు నడుపుతూ వచ్చిన డ్రైవర్‌ను, కాస్త దూరంగా వెళ్లాలని ఆ మహిళా బైకర్ హెచ్చరించింది.
దీంతో ఆగ్రహానికి గురైన ఆ కారు డ్రైవర్, ఆమె బైక్‌ను వెంబడించి వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటనలో బైక్‌తో సహా కిందపడిపోయిన ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, గాయపడిన స్థితిలోనూ ఆ మహిళా బైకర్ ఎంతో ధైర్యంగా కారును అడ్డుకుని డ్రైవర్ దురుసుతనాన్ని నిలదీసింది. “ఎందుకురా బండి ఆపలేదు? నన్నే ఎందుకు వెంబడించి వచ్చావ్?” అని ఆమె తీవ్ర ఆగ్రహంతో నిలదీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు కూడా ఆ మహిళకు మద్దతుగా నిలిచి కారు డ్రైవర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారాలతో పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నడిరోడ్డుపై పట్టపగలు ఓ మహిళపై జరిగిన ఈ రోడ్ రేజ్ (Road rage) దాడిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
