థాయిలాండ్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన భారతదేశానికి చెందిన ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ వంశీ, రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజల సహాయంతో ప్రయాణించే ‘జీరో బడ్జెట్ ట్రావెల్ ఛాలెంజ్’ ప్రయత్నంలో భాగంగా పర్యటిస్తున్నారు.
అతని ఈ సాహస యాత్రలో భాగంగా, థాయిలాండ్‌లోని ఉడాన్ థానీ ప్రాంతంలో ఉన్న చారిత్రక బౌద్ధ దేవాలయ ప్రాంగణంలో రాత్రి సమయంలో బస చేయడానికి సొంతంగా టెంట్ వేసుకున్నాడు. అక్కడి సన్యాసి అనుమతి ఇచ్చారని అతను చెప్పినప్పటికీ, విషయం తెలుసుకుని వచ్చిన ఆలయ యాజమాన్యం మరియు స్థానిక పోలీసులు పూజా స్థలం అనేది క్యాంపింగ్ చేసుకునే స్థలం కాదని, వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు.
పోలీసుల ఆదేశాలను అంగీకరించడానికి ఇష్టపడక యూట్యూబర్ వంశీ వారితో దాదాపు 20 నిమిషాలకు పైగా వాగ్వాదానికి దిగాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న థాయిలాండ్ పోలీసులు, అతనికి సమీపంలోని తక్కువ ధర లాడ్జిలో (రూ. 1000 విలువైన 400 థాయ్ భట్) బస చేయడానికి ఏర్పాట్లు చేస్తామని సూచించారు. అయినప్పటికీ తన వద్ద డబ్బులేదని, రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించడమే తన లక్ష్యమని చెబుతూ ఆ సహాయాన్ని తిరస్కరించాడు. అనంతరం ఈ ఘటనను వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా దావానలంలా వ్యాపించింది.
ఈ వీడియో చూసిన చాలా మంది విదేశాలకు వెళ్లే పర్యాటకులు ఆ దేశ సంస్కృతిని, మతపరమైన ప్రార్థనా స్థలాల నియమాలను గౌరవించాలని ఖండిస్తున్నారు. థాయిలాండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బౌద్ధ దేవాలయాలకు వెళ్లే పర్యాటకులు తగిన దుస్తులు ధరించడంతో పాటు పవిత్రతను కాపాడాలని, అలాగే వీసా నిబంధనల ప్రకారం ప్రయాణానికి అవసరమైన కనీస నిధులు మరియు వసతి ఆధారాలు కలిగి ఉండాలని పేర్కొనబడింది. సరైన అనుమతి లేకుండా ఆధ్యాత్మిక స్థలాలను బసగా మార్చుకోవడానికి ప్రయత్నించిన ఈ భారతీయ యూట్యూబర్ చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply