తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం ఐదు రాష్ట్రాలలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే ఉత్కంఠ అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ విశ్లేషకుల్లోనూ నెలకొంది.
ఈ రాష్ట్రాల్లో రేపు, అంటే మే 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే రోజున ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లను లెక్కిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి రౌండ్ ఫలితాలను వెనువెంటనే విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే వెల్లడించింది. సాధారణంగా ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది? వంటి సమాచారాన్ని టెలివిజన్ వార్తా ఛానళ్లు ప్రసారం చేస్తాయి.
దీని కోసం అందరూ టీవీల ముందు కూర్చుంటారు. అయితే ఈసారి ఇంట్లో లేని వారు, ప్రయాణాల్లో ఉన్నవారు కూడా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఎన్నికల కమిషన్ ఒక కొత్త సౌకర్యాన్ని కల్పించింది.
ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ results.eci.gov.in లో గానీ, లేదా ECINET అనే మొబైల్ యాప్ ద్వారా గానీ ఓట్ల లెక్కింపు వివరాలను వెనువెంటనే తెలుసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
