“ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు!”.. ప్రభుత్వ పాఠశాలలో పాఠం చెబుతుండగానే కూలిన పైకప్పు.. తలకు గాయమైన 6వ తరగతి విద్యార్థిని.. వైరల్ షాకింగ్ వీడియో!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా జిల్లా సిమెంట్ జైత్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, తరగతి గదిలో విద్యార్థులు పాఠాలు వింటుండగా పైకప్పులోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఆరో తరగతి చదువుతున్న అంబికా శ్రీవాస్తవ అనే విద్యార్థిని తలపై పైకప్పు పెచ్చులు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో తరగతి గదిలో ఉన్న ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థినిని బమోర్ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ పాఠశాల భవనం చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్నట్లు సమాచారం. భవనం దుస్థితిపై పాఠశాల ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయుడు గతంలోనే ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా, పాఠశాల ఆవరణలో విషసర్పాలు సంచరిస్తున్నాయని కూడా గతంలో ఫిర్యాదులు అందాయి.

ఇన్ని హెచ్చరికలు చేసినప్పటికీ భవనాన్ని మరమ్మతు చేయడానికి తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులందరూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయానికి వెళ్లి భవనం ప్రమాదకర స్థితిపై మరోసారి విన్నవించారు. విద్యార్థుల భద్రతపై ముందే ఫిర్యాదులు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ పాఠశాలల భవనాలను కూడా తనిఖీ చేసి, ప్రమాదకర స్థితిలో ఉన్నవాటిని వెంటనే మరమ్మతు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *