మిడిల్ ఈస్ట్‌లో రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం తన పౌరులకు అత్యవసర భద్రతా హెచ్చరికను జారీ చేసింది.
అమెరికన్ పౌరులెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌లో పర్యటించవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్న అమెరికన్లు వెంటనే ఆ దేశం విడిచి బయటకు రావాలని సూచించింది.
ఇరాన్‌లోని అమెరికా వర్చువల్ ఎంబసీ జారీ చేసిన హెచ్చరికలో.. ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని పేర్కొంది. దీనివల్ల ఏ క్షణంలోనైనా విమాన సేవలు రద్దు చేయబడవచ్చని, గగనతలం (ఎయిర్‌స్పేస్) మూసివేయబడవచ్చని లేదా ముందస్తు ప్రకటన లేకుండా సరిహద్దు నియమాలు మారవచ్చని, కాబట్టి అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది.
సౌదీ అరేబియాపై హూతీ గ్రూపుల దాడులు, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల బెదిరింపుల కారణంగా, సైనిక ఘర్షణలు తీవ్రమయ్యే అవకాశం ఉందని అమెరికా స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న అమెరికా వాణిజ్య సంస్థలు, రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరగవచ్చనే ఆందోళన నెలకొంది.
అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధికారులను సంప్రదించడానికి వీలుగా, విదేశాంగ శాఖకు చెందిన ‘స్టెప్’ (STEP) ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలని పౌరులను కోరింది. అంతేకాకుండా, అక్కడ జరిగే నిరసనలు, ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాలు మరియు పోలీసుల మోహరింపు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని వారికి సూచించింది.
వైమానిక దాడులు లేదా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే కిటికీలు, అద్దాల తలుపులకు దూరంగా ఉండాలని, అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అమెరికా ప్రభుత్వం తన ప్రజలను ఆదేశించింది. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక మరియు సముద్ర జలాల పరమైన ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

Leave a Reply