ఎయిర్ ఇండియాలో బిందీ, సింధూరంపై నిషేధమా? సోషల్ మీడియాలో దుమారం; కంపెనీ క్లారిటీ!

న్యూఢిల్లీ: లెన్స్‌కార్ట్ వివాదం సద్దుమణగకముందే, ఇప్పుడు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ‘ఎయిర్ ఇండియా’ తన డ్రెస్ కోడ్ నిబంధనల వల్ల చిక్కుల్లో పడింది. ఇటీవల సోషల్ మీడియాలో ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ‘గైడ్‌లైన్ బుక్’ (గూమింగ్ హ్యాండ్‌బుక్) స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి.

ఆ హ్యాండ్‌బుక్ ప్రకారం.. విధుల్లో ఉన్న క్యాబిన్ క్రూ సిబ్బంది బిందీ, సింధూరం, తిలకం, గాజులు మరియు చేతికి కట్టే పవిత్ర దారాలను (కలవా) ధరించడానికి అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ సంస్కృతిని అవమానించడమేనని విమర్శలు గుప్పించారు.

ప్రణవ్ మహాజన్ అనే యూజర్ ‘X’ (ట్విట్టర్)లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. వివాహానికి సంబంధించిన గుర్తులు మరియు మతపరమైన దారాలపై ఆంక్షలు విధించడం తప్పు అని రాశారు. ఇతర మతపరమైన చిహ్నాలకు అనుమతి ఉన్నప్పుడు, బిందీ మరియు సింధూరంపై ఎందుకు నిషేధం అని చాలా మంది ప్రశ్నించారు.

వైరల్ హ్యాండ్‌బుక్‌లో ఏముంది?
సోషల్ మీడియాలో తిరుగుతున్న పత్రాల ప్రకారం.. డ్యూటీలో ఉన్నప్పుడు బిందీ, సింధూరం, తిలకం మరియు కలవా ధరించకూడదు. 2022 నాటి పాత నిబంధనల ప్రకారం పెద్ద బిందీలపై నిషేధం ఉండేది, కానీ 0.5 సెం.మీ కంటే తక్కువ పరిమాణం ఉన్న చిన్న బిందీని చీరతో పాటు ధరించడానికి అనుమతి ఉండేది. అయితే, ఇప్పుడు పూర్తిగా నిషేధించారనే వార్త చర్చనీయాంశమైంది.

ఎయిర్ ఇండియా వివరణ:
వివాదం ముదురుతుండటంతో ఎయిర్ ఇండియా వెంటనే స్పందించింది. “ఎయిర్ ఇండియా తన సిబ్బంది బిందీ ధరించడాన్ని నిషేధించలేదని స్పష్టం చేస్తోంది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఫోటోలు పాత మ్యాన్యువల్‌కు సంబంధించినవి, ప్రస్తుతం ఆ నిబంధనలు అమలులో లేవు” అని కంపెనీ వివరణ ఇచ్చింది.


Posted

in

by

Tags: