ఉత్తరప్రదేశ్కు చెందిన ఓంవతి అనే గ్రామీణ మహిళ, విరిగిపోయిన రైలు పట్టాలను సమయస్ఫూర్తితో గుర్తించి, తన ఎర్రటి చీర కొంగును ఊపి పెను రైలు ప్రమాదాన్ని అడ్డుకున్న ఘటన సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
రోజూలాగే ఉదయం 8 గంటల సమయంలో గుల్పా రైల్వే స్టేషన్ సమీపంలోని తన వ్యవసాయ పొలానికి ఓంవతి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో పట్టాలు విరిగి ఉండటం చూసి ఆమె షాక్కు గురైంది. ప్రతిరోజూ అదే సమయానికి ఎటా-తుండ్లా ప్యాసింజర్ రైలు ఆ మార్గంలో వస్తుందన్న విషయం ఆమెకు వెంటనే గుర్తొచ్చింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన ఓంవతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి పరుగెత్తి, ఒక ఎర్రటి గుడ్డను తీసుకొచ్చి విరిగిన పట్టాల వద్ద కట్టింది.
అంతటితో ఊరుకోకుండా రైలు వచ్చేంత వరకు పట్టాల వద్దే వేచి చూసింది. రైలు కూత శబ్దం వినపడగానే, తాను కట్టుకున్న ఎర్ర చీర కొంగును చేత్తో పట్టుకుని డేంజర్ సిగ్నల్లా నిరంతరం అటూ ఇటూ ఊపింది. పట్టాలకు కట్టిన ఎర్ర గుడ్డను, కొంగు ఊపుతున్న మహిళను దూరం నుంచే గమనించిన లోకో పైలట్, వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు.
విరిగిన పట్టాలకు కొద్ది దూరంలోనే రైలు సురక్షితంగా ఆగింది. కిందకు దిగిన డ్రైవర్కు ఓంవతి విరిగిన పట్టాలను చూపించగా, అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అరగంటలోనే దాన్ని మరమ్మతు చేశారు. తన సమయస్ఫూర్తితో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఓంవతిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆకాశానికెత్తుతూ ప్రశంసిస్తున్నారు.
