మధ్యప్రదేశ్ రాష్ట్రం రీవా జిల్లా జవా తాలూకాలోని ఒక గ్రామం నుంచి వెలుగుచూసిన దిగ్భ్రాంతికర వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
ఆ ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, వరదల్లో వంతెన మునిగిపోవడంతో గ్రామానికి అంబులెన్స్ రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ బంధువు మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు, కర్రలతో తయారుచేసిన తాత్కాలిక తెప్పపై ఉంచి ప్రమాదకర రీతిలో నదిని దాటించాల్సిన దుస్థితి నెలకొంది.
వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామంలోకి వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. దాంతో వేరే దారి లేక గ్రామస్తులు రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను కలిపి కట్టి, వాటిపై శవాన్ని ఉంచి ప్రమాదకరంగా వరద నీటిని దాటించారు. కడతేరిన మృతదేహానికి కూడా కడసారి గౌరవం దక్కని ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న కనీస మౌలిక వసతుల లేమిని, అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది.
ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు విన్నవించినా గ్రామ సర్పంచ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా, “మేము ఎమ్మెల్యే మనుషులం, పనులు ఇలాగే జరుగుతాయి.. ఎవరు బతికితేనేం, ఎవరు చస్తేనేం?” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ప్రాంతంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయనడానికి రుజువుగా గత జూలై 4న కూడా ఒక సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యానికి గురైన ఒక గిరిజన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డుగానీ, అంబులెన్స్ సదుపాయంగానీ లేకపోవడంతో గ్రామస్తులు ఆమెను ఒక మంచంపై పడుకోబెట్టి బురద దారుల్లో మోసుకుంటూ వెళ్లారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Leave a Reply