అతి వేగం, అజాగ్రత్త ప్రాణాలను ఎలా బలితీసుకుంటాయో చెప్పడానికి ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్-హరిద్వార్ హైవేపై జరిగిన ఈ భీకర ప్రమాదమే సాక్ష్యం. అర్థరాత్రి వేగంగా వచ్చిన ఎస్యూవీ కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
మరణానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది? ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు ఈ యువకులు కారులో పార్టీ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నలుగురు స్నేహితులు కారులో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ కనిపించారు. ముందు సీట్లో ఉన్న యువకుడు సీట్ బెల్ట్ ధరించకుండా, డాష్ బోర్డుపై తల పెట్టి వెనక్కి తిరిగి ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రైవర్ కూడా డ్రైవింగ్ మీద శ్రద్ధ పెట్టకుండా స్నేహితులతో కలిసి పాటలు పాడుతున్నాడు. ఎవరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఈ సరదా రీల్స్ చిత్రీకరిస్తున్న సమయంలోనే వీడియో ఒక్కసారిగా నల్లగా మారిపోయి, కారు అద్దాలు పగిలిన పెద్ద శబ్దం వినిపించింది.
లారీ కిందకు దూసుకెళ్లిన కారు: హరిద్వార్‌లోని మానసా దేవి రైల్వే క్రాసింగ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. హరిద్వార్ నుండి రిషికేశ్ వైపు అతివేగంగా వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయి ట్రక్కు కింద ఇరుక్కుపోయింది.
స్థానిక యువకుల మృతి: మరణించిన నలుగురు యువకులు స్థానికులేనని, వారంతా స్నేహితులని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి, డ్రైవింగ్ సమయంలో అజాగ్రత్తగా ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తెలిసింది.
