ప్రియురాలి కోరిక ప్రాణం తీసింది: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ అంతం ఎలా జరిగింది?

అమెరికా ప్రభుత్వం ఎవరి తలకైతే రూ. 136 కోట్ల రివార్డు ప్రకటించిందో, ఆ కరడుగట్టిన క్రిమినల్ తన రహస్య స్థావరంలో ఉన్నప్పుడు ఒకరోజు తన ప్రియురాలిని చూడాలని ఆశపడ్డాడు. ఆ కోరికే అతని పాలిట మృత్యువైంది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మాఫియా నాయకుడు ‘ఎల్ మెంచో’ హతమైన తీరు ఇది.

ఎల్ మెంచో సాధారణ నేరస్థుడు కాదు. మాఫియాకు పుట్టినిల్లుగా పేరుగాంచిన మెక్సికోలో ‘హాలిస్కో న్యూ జనరేషన్ మాఫియా’ (CJNG) అనే శక్తివంతమైన ముఠాకు ఇతడు నాయకుడు. టన్నుల కొద్దీ సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేవాడు. 2019 గణాంకాల ప్రకారం ఇతని ఆస్తి ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ. 96,000 కోట్లు). ప్రస్తుతం అది ఇంకా ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది.

కానిస్టేబుల్ నుండి డ్రగ్ మాఫియా రాజు వరకు
ఒకప్పుడు పోలీసుగా పనిచేసిన ఇతడు, ఆ తర్వాత డ్రగ్ మాఫియా రాజుగా మారాడు. ఇతని ముఠాలో దాదాపు 20 వేల మంది సభ్యులు ఉన్నారు. మద్యం, మహిళలు, డబ్బు ఇతని బలహీనతలు. క్రూరత్వంలో ఇతడు మిగతా డ్రగ్ మాఫియా లీడర్లందరినీ మించిపోయాడు. ఇతడిని పట్టుకోవడానికి అమెరికా 15 మిలియన్ డాలర్ల (రూ. 136 కోట్లు) రివార్డును ప్రకటించింది.

ప్రియురాలిని అనుసరించిన సైన్యం
అమెరికా, మెక్సికో సైన్యాలు ఏళ్ల తరబడి ఇతని కోసం వెతుకుతున్నాయి. అగమ్యగోచరమైన పర్వత ప్రాంతాల్లో ఇతని రహస్య స్థావరాలు ఉండేవి. సొంతంగా నిఘా విభాగం, భద్రతా దళం కూడా ఉండటంతో ప్రతిసారీ పోలీసుల నుంచి తప్పించుకునేవాడు. కానీ చివరకు ఒక ప్రేమ కథ అతడిని చిక్కించింది.

అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎల్ మెంచో తన ప్రియురాలిని కలవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలించగా, ఆమెకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి గురించి తెలిసింది. మెక్సికన్ రహస్య పోలీసులు అతడిని వెంబడించగా, అతను ఎల్ మెంచో ప్రియురాలితో కలిసి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ ప్రయాణం మెంచో అడ్డా అయిన హాలిస్కో రాష్ట్రంలోని అడవి ప్రాంతానికి అని నిర్ధారించుకున్న పోలీసులు, వెంటనే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు.

భీకర కాల్పులు – ఎల్ మెంచో అంతం
ఏడు హెలికాప్టర్లు, రెండు డ్రోన్లు మరియు ఒక చిన్న విమానంతో సైన్యం అడవిలోని రహస్య స్థావరాన్ని ముట్టడించింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో భీకర పోరు మొదలైంది. మాఫియా ముఠా ప్రతిఘటించడంతో జరిగిన కాల్పుల్లో 25 మంది సైనికులు, పలువురు నేరస్థులు మరణించారు. చివరికి కమెండోలు ఆ స్థావరాన్ని చుట్టుముట్టి 59 ఏళ్ల ఎల్ మెంచోను ప్రాణాలతో పట్టుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మెంచో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు, అయితే పట్టుకున్న వెంటనే అతడిని కాల్చి చంపారని కూడా వార్తలు వస్తున్నాయి.

మెక్సికోలో హింసాకాండ
ఎల్ మెంచో మరణవార్త తెలియగానే మెక్సికో రగిలిపోయింది. మాఫియా సభ్యులు తుపాకులతో వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టించారు. దేశంలోని 32 రాష్ట్రాలలో 20 రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. హైవేలను దిగ్బంధించారు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. విమాన, బస్సు సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 62 మంది మరణించగా, 34 మంది మాఫియా సభ్యులను సైన్యం హతమార్చింది. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.


Posted

in

by

Tags: