పర్యావరణానికి, ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా పేపర్ (కాగితం) స్ట్రాల వాడకం భారీగా పెరిగింది. అయితే, ఈ పేపర్ స్ట్రాలు మేలు కంటే అనేక రెట్లు ఎక్కువ కీడును కలిగిస్తున్నాయనే షాకింగ్ విషయాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది.
కేవలం పేపర్ స్ట్రాలతో శీతల పానీయాలు (కూల్డ్రింక్స్) తాగడాన్ని మాత్రమే కాకుండా.. అవి తయారు చేసే విధానం, వాటి వల్ల కలిగే పర్యావరణ నష్టం, అలాగే వాటిని చెత్తలో పడేసినప్పుడు జరిగే రసాయన మార్పులు.. వీటన్నింటినీ దక్షిణ కొరియా పరిశోధకులు లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల్లో, సాధారణ ప్లాస్టిక్ స్ట్రాల కంటే పేపర్ స్ట్రాలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 6.33 రెట్లు అధికమని తేలింది.
అంతేకాకుండా, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా భావించే బయో-ప్లాస్టిక్ (Bio-plastic) స్ట్రాలను ఉపయోగిస్తే క్యాన్సర్ ముప్పు దాదాపు 16 రెట్లు పెరుగుతుందని పరిశోధకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తంతి టీవీ (Thanthi TV) ప్రచురించిన ఈ షాకింగ్ న్యూస్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతూ.. సాధారణ ప్రజలు మరియు ఆరోగ్య కార్యకర్తల మధ్య తీవ్ర చర్చకు, దిగ్భ్రాంతికి దారి తీసింది.
