కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తమ ‘పాఠశాలలను బాగుచేద్దాం’ (స్కూల్ ఠీక్ కరో) ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ నేపథ్యంలో, నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై, విద్యార్థుల భద్రతపై సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే బయటపెట్టిన తాజా అంశాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
ప్రభుత్వ బడులలో కనీస మౌలిక వసతులు లేకపోవడమే కాకుండా, కొన్ని పాఠశాల ప్రాంగణాల్లో మద్యం, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వాడుతున్నారని సీజేపీ ఆరోపించింది. దీనిపై తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అభిజీత్ దీప్కే.. ‘పాఠశాల లోపలికి మద్యాన్ని అనుమతిస్తున్నారు, కానీ దాని గురించి తనిఖీ చేసి ప్రశ్నిస్తే మాత్రం భద్రతా సమస్యలంటూ మాట్లాడుతున్నారా?’ అని సూటిగా నిలదీశారు.
అంతేకాకుండా, నాగ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి కొరత, నాణ్యత లేని ఆహారం, సరిపడా తరగతి గదులు లేని దయనీయ పరిస్థితులు ఉన్నాయని సీజేపీ ఎత్తిచూపింది. తరగతి గదుల కొరత వల్ల వేర్వేరు తరగతులకు చెందిన విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొంది.
పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులకు ఐదో తరగతి మార్కుల జాబితాలు (మార్క్‌షీట్స్) కూడా ఇంకా అందలేదన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది. ఇంతటి అభద్రత, అధ్వాన్నమైన వాతావరణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు ఎలా పంపించగలరని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు.
ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, అభిజీత్ దీప్కే ఆగస్టు 15న హింగోలీ జిల్లాలోని సంతుక్ పింప్రి గ్రామంలో ఈ ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. నాగ్‌పూర్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి, అక్కడి సమస్యలపై ఫిర్యాదులు చేయాలని సీజేపీ ప్రజలకు, విద్యార్థులకు పిలుపునిచ్చింది.

Leave a Reply