“ఏకాంత ఫోటోలతో బెదిరింపులు. సాధువు వేషం వదిలి బిచ్చగాడిగా దాక్కున్న హంతకుడు. కోల్‌కతాలో చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు.!!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్‌పత్‌లో తీవ్ర కలకలం రేపిన అంకిత్, ఇస్రార్ జంట హత్యల కేసులో, అజ్ఞాతంలో ఉన్న.. రూ.25 వేల రివార్డు ప్రకటించబడిన ప్రధాన నిందితుడు సాధువు నరేష్‌నాథ్‌ను పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో అరెస్టు చేశారు.

గత జులై 25వ తేదీన లహౌరా గ్రామంలోని గణేష్ ఆలయంలో ఇద్దరు స్నేహితులను హత్య చేసి, ఆలయం లోపలే వారి మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పట్టుబడిన సాధువు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

హత్యకు గురైన అంకిత్ సోదరితో సాధువు నరేష్‌నాథ్‌కు సంబంధం ఉందని, వారిద్దరి ఏకాంత ఫోటోలను చూపించి డబ్బుల కోసం అంకిత్ పదేపదే సాధువును బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది. దీంతో ఆగ్రహం, పరువు పోతుందన్న భయంతో.. అంకిత్, అతనితో పాటు వచ్చిన అతని స్నేహితుడు ఇస్రార్ ఇద్దరికీ నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చి మత్తులోకి జారుకునేలా చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

ఆ తర్వాత సాక్ష్యాలను మాయం చేసే ఉద్దేశ్యంతో, ఆలయ ప్రాంగణంలోనే గుంత తీసి ఇద్దరి మృతదేహాలను పూడ్చిపెట్టి, దానిపై టైల్స్ వేసి సిమెంట్ పూసి కప్పిపెట్టాడు.

ఈ ఘాతుకం తర్వాత పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సాధువు నరేష్‌నాథ్, ముందుగా హరిద్వార్ వెళ్లి.. అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోయి తలదాచుకున్నాడు. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో కోల్‌కతాకు చేరుకున్న అతను, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన గుర్తింపును పూర్తిగా మార్చుకున్నాడు. సాధువు అవతారాన్ని విడిచిపెట్టి బిచ్చగాడిలా నటిస్తూ దేవాలయాల వద్ద తలదాచుకున్నాడు.

అయితే, పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి, అతని ఆచూకీని కనిపెట్టి కోల్‌కతాలో చాకచక్యంగా పట్టుకున్నారు.

బాగ్‌పత్‌కు తీసుకొచ్చి తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్న అనంతరం, ఈ సాధువును న్యాయస్థానంలో హాజరుపరిచి ప్రస్తుతం జైలుకు తరలించారు. ఈ దారుణ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *