“ఏడడుగులు నడిచాక వరుడికి ఎదురైన అసలు పరీక్ష..!” డబ్బులు లెక్కపెట్టమనగానే తడబాటు.. “డబ్బులే లెక్కపెట్టడం రాని వీడు సంసారం ఎలా చేస్తాడు..?” చివరికి వధువు ఇచ్చిన సంచలన ట్విస్ట్..!!

వివాహ తంతు అంతా పూర్తయి, ఏడడుగులు కూడా వేసిన తర్వాత, మరుసటి రోజు ఉదయం జరిగిన ఒక చిన్న సంఘటనతో ఆ పెళ్లి కాస్తా రద్దయింది. పెళ్లి సమయంలో మహిళలు చదివించిన కట్నపు డబ్బులను (మొయ్ డబ్బులను) లెక్కపెట్టమని చెప్పగా, వరుడు పదేపదే తప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసి షాక్‌కు గురైన వధువు, అతనితో కలిసి అత్తారింటికి వెళ్లలేనని తేల్చి చెప్పింది. చివరకు ఇరు కుటుంబాల వారు చర్చించుకుని వివాహాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించారు. దీంతో వరుడు పెళ్లికూతురు లేకుండానే ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. గత నవంబర్ 25వ తేదీన రాహుల్ కుమార్ అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహం జరిగింది. వరుడు మేళతాళాలతో బంధువులతో కలిసి ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చాడు. రాత్రి వేళ ద్వారపూజ, స్వాగత వేడుకలతో సహా సంప్రదాయ తంతులు, వివాహ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోయాయి. ఇరు కుటుంబాల వారు ఎంతో సంతోషంగా ఉన్న తరుణంలో, మరుసటి రోజు ఉదయం జరిగిన ఒక ఆచారం మొత్తం పరిస్థితినే తలకిందులు చేసింది.

పెళ్లి పూర్తయిన తర్వాత, గ్రామ మహిళలు వరుడికి చదివించిన డబ్బులను లెక్కపెట్టే కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో వరుడు నోట్లు లెక్కపెట్టడం ప్రారంభించగా, పదేపదే తప్పులు చేసినట్లు సమాచారం. ఎన్నిసార్లు ప్రయత్నించినా కచ్చితమైన మొత్తాన్ని అతను లెక్కించలేకపోయాడు. పెళ్లికి ముందు వరుడు బాగా చదువుకున్నవాడని, ఉద్యోగం చేస్తున్నాడని చెప్పిన నేపథ్యంలో, కనీసం సాధారణ డబ్బులను కూడా సరిగ్గా లెక్కపెట్టలేకపోతున్నాడే అని వధువుకు అనుమానం వచ్చింది. భవిష్యత్తులో కుటుంబ బాధ్యతలను ఎలా మోస్తాడని ప్రశ్నించిన ఆమె, అత్తారింటికి వచ్చే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చుంది.

వధువు నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. దీంతో పెళ్లిలో ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు, ఇతర వస్తువులను తిరిగి అప్పగించే విషయమై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న 112 అత్యవసర సహాయక పోలీసులు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని జోక్యం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల వారు చర్చలు జరిపి, చివరకు రాజీకి వచ్చారు. వరుడి తరపు వారికి ఇచ్చిన బహుమతులను తిరిగి ఇచ్చేశారు. ఏడడుగులు పూర్తయి వివాహ వేడుకలన్నీ ముగిసిన తర్వాత కూడా, చివరి నిమిషంలో వధువు కాపురానికి రావడానికి నిరాకరించడంతో వరుడు పెళ్లికూతురు లేకుండానే తన ఇంటికి వెనుదిరగాల్సి వచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *