ఏడేళ్ల కుమారుడికి తల్లి జుట్టు కత్తిరించడంతో కుటుంబంలో కలకలం..! “కుటుంబమంతా షాక్‌”.. కోపంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 72 ఏళ్ల తాత.. సిక్కు మత సంప్రదాయాలకు విరుద్ధమంటూ ఫిర్యాదు!

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నగరంలో ఓ కుటుంబంలో చోటుచేసుకున్న వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఏడేళ్ల సిక్కు బాలుడి జుట్టును అతడి తల్లే కత్తిరించడంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి.

తన మత విశ్వాసాలకు విరుద్ధంగా మనవడి జుట్టు కత్తిరించిందంటూ బాలుడి తాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మండి నగరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఏడేళ్ల మనవడు ఉన్నాడు. ఆ బాలుడు అక్కడి ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం జుట్టును కత్తిరించకుండా పెంచుకోవడం ఎంతో ముఖ్యమైన మతపరమైన ఆచారంగా, గుర్తింపుగా భావిస్తారు.

ఈ నేపథ్యంలో, గత నవంబర్ 21న బాలుడి తల్లి తన కుమారుడి జుట్టును కత్తిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడి తాత.. తమ కుటుంబ మతపరమైన భావాలను కోడలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిందని ఆరోపించారు.

ఈ విషయంపై మండి సదర్ పోలీస్ స్టేషన్‌లో వృద్ధుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించి, ప్రజల మతపరమైన భావాలను దెబ్బతీసినట్లు ఆరోపిస్తూ భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 299 కింద మహిళపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తూ, జుట్టు కత్తిరించడానికి గల కారణాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *