గతంలో వచ్చిన “క్వైట్ క్విటింగ్” (Quiet Quitting) తరహాలోనే, ఇప్పుడు సోషల్ మీడియాలో “లేజీ గర్ల్ జాబ్స్” అనే పదం మార్మోగిపోతోంది. ముఖ్యంగా జెన్-జీ (1997-2012 మధ్య జన్మించిన వారు) నిపుణులు ఈ సంస్కృతిని అమితంగా ఇష్టపడుతున్నారు.
అసలు ఈ ట్రెండ్ ఉద్దేశ్యం ఏమిటి?
పేరులో ‘లేజీ’ (బద్ధకం) అని ఉన్నప్పటికీ, ఇది బద్ధకానికి సంబంధించింది కాదు. ఇది పని ఒత్తిడిని తగ్గించుకుని, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం గురించి.
- తక్కువ ఒత్తిడి – స్థిరమైన ఆదాయం: పని భారం తక్కువగా ఉంటూ, మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలను వెతుక్కోవడం.
- ఫ్లెక్సిబిలిటీ: ఇంటి నుండే పనిచేసే సదుపాయం (Remote work) లేదా పని వేళల్లో వెసులుబాటు ఉండటం.
- నో హజిల్ కల్చర్ (No Hustle Culture): రాత్రింబవళ్లు కష్టపడి ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే, నిర్ణీత సమయంలో పని ముగించి ప్రశాంతంగా ఉండటం.
ఎలాంటి ఉద్యోగాలను ‘లేజీ గర్ల్ జాబ్స్’ అంటున్నారు?
సాధారణంగా మార్కెటింగ్ అసోసియేట్స్, అకౌంట్ మేనేజర్లు, కస్టమర్ సక్సెస్ మేనేజర్ల వంటి పోస్టులను ఈ కోవలోకి చేరుస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో పని పూర్తి చేసినంత వరకు ఎవరూ ఒత్తిడి చేయరనేది వీరి భావన.
బౌండరీస్ vs బర్న్ అవుట్ (అలసట)
గాలప్ (Gallup) నివేదిక ప్రకారం, పని ఒత్తిడి వల్ల ఉద్యోగులు తీవ్రమైన మానసిక అలసటకు (Burnout) గురవుతున్నారు.
- 76% మంది ఉద్యోగులు అప్పుడప్పుడు పనిలో ఒత్తిడికి లోనవుతుంటే, 28% మంది ఎప్పుడూ అలసిపోతున్నట్లు చెబుతున్నారు.
- తరచూ ఒత్తిడికి గురయ్యే వారు సిక్ లీవ్స్ పెట్టడానికి 63% ఎక్కువ అవకాశం ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా కేవలం 33% మంది మాత్రమే తాము సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.
