‘ఏసీ బాగు చేయడానికి వచ్చి ₹50 లక్షల సొత్తు దోచుకెళ్లారు’.. 24 గంటల్లోనే గర్భిణీ వదిన కుట్ర బట్టబయలు, షాక్‌లో ఆడపడుచు!

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో జరిగిన ₹50 లక్షల సంచలనాత్మక దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, దొంగిలించబడిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి కుట్ర పన్నింది మరెవరో కాదు, గర్భిణీ అయిన ఫిర్యాదుదారు పింకీ శ్రీవాస్తవ. ఆమె తన భర్త శుభమ్ మరియు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ డ్రామాకు తెరలేపింది.

ఆడపడుచు ఇంట్లోనే గర్భిణీ వదిన కుట్ర
అసలు విషయానికొస్తే.. దబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సచ్‌దేవా కాలనీలో జూన్ 4న పట్టపగలు జరిగిన ఈ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ మోనికా శ్రీవాస్తవ ఇంట్లో ఆమె గర్భిణీ వదిన పింకీ శ్రీవాస్తవ తన కుమారుడితో కలిసి ఉంది. మోనిక తన ఉద్యోగానికి (డ్యూటీకి) వెళ్లింది. అదే సమయంలో బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు, వారిలో ఒకరు ముఖానికి గుడ్డ కట్టుకోగా, మరొకరు హెల్మెట్ ధరించి ఉన్నాడు. తాము ఎయిర్ కండీషనర్ (ఏసీ) రిపేర్ చేయడానికి వచ్చామని చెప్పి లోపలికి ప్రవేశించి, ఈ దోపిడీకి పాల్పడ్డారు.

పోలీసులకు అల్లిన అబద్ధపు కథ
గర్భిణీ పింకీ గ్వాలియర్ పోలీసులకు చెప్పిన అబద్ధపు కథ ప్రకారం.. ఆ ఇద్దరు యువకులు ఏసీ బాగు చేయడానికి వచ్చామని చెప్పారు. మోనిక తమను పిలిచిందని వారు తెలిపారు. దీంతో పింకీ ఆమెకు ఫోన్ చేసి అడగడానికి లోపలికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఒకడు పింకీ కణతపై తుపాకీ పెట్టాడు. ఆ తర్వాత ఆమె చేతులు, కాళ్లు, నోరు కట్టేసి దాడి చేశారు. అనంతరం నిందితులు ఇంటో ఉన్న మూడు నుండి నాలుగు లక్షల రూపాయల నగదు, సుమారు ₹46 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఊడ్చేసి పారిపోయారు. ఈ ఘటన పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

దోపిడీ గుట్టు రట్టయిందిలా..
ఈ విషయమై గ్వాలియర్ ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు అనుమానంతో పింకీ, ఆమె భర్తను గట్టిగా విచారించడంతో ఈ దబ్రా దోపిడీ కేసు గుట్టు రట్టయిందని తెలిపారు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అసలు కథ ప్రకారం.. మోనిక (రానూ), పింకీ భర్త అయిన శుభమ్‌కు సొంత సోదరి (ఆడపడుచు). శుభమ్, అతని భార్య పింకీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ సోదరి రానూ ఇంట్లోనే నివసిస్తున్నారు. ఒకరోజు పింకీ తన ఆడపడుచు రానూ ఇంట్లోని అల్మారాలో డబ్బులు, నగలు పెట్టడం చూసింది. ఆ క్షణమే పింకీ తన ఆడపడుచు ఇంట్లోనే దోపిడీ చేయాలని ప్లాన్ వేసింది.

గర్భిణీ వదిన పక్కా ప్లాన్
ఆడపడుచు రానూ తన ఉద్యోగానికి వెళ్లిన తర్వాతే ఈ దోపిడీ డ్రామాను అమలు చేయాలని పింకీ పథకం రచించింది. పింకీ ప్లాన్ ప్రకారం.. ఏసీ బాగు చేసే నెపంతో, ముఖానికి గుడ్డలు కట్టుకుని రావాలని శుభమ్ మరియు సోనులను ఇంటికి పిలిపించింది. ఆపై అల్మారాలో ఉన్న నగలు, నగదును తీసి వారికి ఇచ్చి అక్కడి నుండి పంపించేసింది.

కేకలు వేసి అబద్ధపు కథ అల్లేసింది
దొంగతనం సజావుగా సాగిపోయిన తర్వాత, పింకీ గట్టిగా కేకలు వేస్తూ పొరుగువారిని, పోలీసులను పిలిచి.. ఎవరో వచ్చి దోచుకెళ్లారని అబద్ధపు కథలు చెప్పింది. అయితే పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఈ దోపిడీ డ్రామాను బట్టబయలు చేశారు. పింకీ, శుభమ్ మరియు వారి స్నేహితులు సోనూ కౌశిక్, ఆసిఫ్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగిలించబడిన పూర్తి సొత్తును రికవరీ చేశారు.


Posted

in

by

Tags: