అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెజమిన్ నెతన్యాహు బస చేసిన లగ్జరీ హోటల్‌కు అతిసమీపంలో, తెల్లవారుజామున మ్యాన్‌హోల్ మూత తెరుచుకుని ముగ్గురు అపరిచిత వ్యక్తులు బయటకు వచ్చిన సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
మాన్‌హాటన్‌లోని అప్పర్ ఈస్ట్ సైడ్ ప్రాంతంలో ఉన్న పార్క్ అవెన్యూ జంక్షన్ వద్ద తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. హోటల్ ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్ నుంచి హఠాత్తుగా ముగ్గురు బయటకు వచ్చి, అక్కడ సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఎక్కి పరారైన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయి తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఐరాస సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్ నగరం మొత్తాన్ని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి తీసుకువచ్చిన తరుణంలో, ప్రపంచ దేశాల అత్యంత ముఖ్యమైన దౌత్యవేత్తలు/నాయకులు బస చేసే ప్రాంతం కింద ఇలాంటి అనుమానాస్పద చర్య జరగడం భద్రతా బలగాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ విషయం తెలిసిన వెంటనే న్యూయార్క్ నగర పోలీసులతో పాటు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సునిశిత తనిఖీలు చేపట్టాయి.
అయితే, ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు, “ఇటీవల న్యూయార్క్‌లో భారీ వర్షాల తర్వాత డ్రైనేజీ కాల్వల్లోకి దిగి పాత ఇనుము, లోహాలు మరియు పోగొట్టుకున్న విలువైన వస్తువులను వెతికే ముఠాలు తిరుగుతున్నాయి. ఇది కూడా అలాంటి ఒక సంఘటనగానే కనిపిస్తోంది” అని వివరణ ఇచ్చారు.
కానీ, ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తున్న ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని భద్రతా ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో మ్యాన్‌హోల్ గుండా అపరిచిత వ్యక్తులు వచ్చి వెళ్లడాన్ని కేవలం ఒక సాధారణ సంఘటనగా కొట్టిపారేయలేమని భద్రతా నిపుణులు, నెటిజన్లు ఘాటుగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

Leave a Reply