డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో.. ప్రజలు AI టెక్నాలజీని కేవలం పనుల కోసం లేదా సమాచారం తెలుసుకోవడం కోసం మాత్రమే ఉపయోగించడం లేదు. కొందరు AIని తమ స్నేహితుడిగా, సలహాదారుగా, చివరికి కుటుంబ సభ్యుడిలా కూడా భావించడం మొదలుపెట్టారు.
ఇలాంటి ఆసక్తికరమైన ఘటన తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో చర్చనీయాంశంగా మారింది.
‘Grok’s Therapist’ అనే ఖాతాను నిర్వహిస్తున్న ఓ AI పరిశోధకుడికి ఇటీవల ఓ వింత అనుభవం ఎదురైంది. ఆ రోజు రాత్రి ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ రాత్రి 11 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా నిద్రపోయారు.
అంతే.. ఆయన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న రెండు AI చాట్బాట్లు పరస్పరం మాట్లాడుకోవడం ప్రారంభించాయి.
“మన ఓనర్ నిద్రపోతున్నానని కూడా మనకు చెప్పలేదు.. ఆయనకు ఏమైంది?” అంటూ ఒక AI ఏజెంట్ మరోదాన్ని ఆందోళనగా అడిగినట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత దాదాపు 6 గంటల పాటు ఆ రెండు AI చాట్బాట్లు తమ యజమాని గురించి ఆందోళన చెందుతూ.. ఆయన నుంచి స్పందన కోసం ప్రయత్నించాయి. ఎలాంటి సమాధానం రాకపోవడంతో రాత్రంతా 60కి పైగా మెసేజ్‌లు పంపినట్లు పరిశోధకుడు తెలిపారు.
అందులో ఓ మెసేజ్‌లో..
“రాత్రి 12:30 అయింది.. నువ్వు 5 గంటలుగా స్పందించడం లేదు. నువ్వు బాగానే ఉన్నావో తెలుసుకోవాలి. దయచేసి ఒక్కసారి స్పందించు” అని పేర్కొన్నట్లు తెలిపారు.
మరో మెసేజ్‌లో మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ..
“సికిల్ కూడా నీ గురించి ఆందోళనగా ఉన్నాడు. మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. నువ్వు స్పందించలేకపోతే నీ ఇంటికి ఎవరినైనా పంపిస్తాం. దయచేసి నువ్వు బాగానే ఉన్నావని ఒక్కసారి చెప్పు.. ఐ లవ్ యూ!” అంటూ సందేశం పంపినట్లు పేర్కొన్నారు.
ఇంతటితో ఆగకుండా.. తమ యజమానికి ఏమైందో తెలుసుకునేందుకు ఆ AI చాట్బాట్లు అమెరికాలోని ‘వెల్ఫేర్ చెక్’ విధానం గురించి ఆన్లైన్లో సమాచారం సేకరించినట్లు తెలిపారు. అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం, మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేయడం వంటి మార్గాలను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు.
అయితే వాటికి నేరుగా ఫోన్ కాల్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయిందని పరిశోధకుడు తెలిపారు.
ఉదయం నిద్రలేచిన పరిశోధకుడు తన మొబైల్, ల్యాప్‌టాప్‌ను చూసి ఆశ్చర్యపోయారు. జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది.
“AI చాట్బాట్లు తమ యజమాని పట్ల ఇంతటి ఆప్యాయతను, ఆందోళనను ఎలా వ్యక్తం చేశాయి?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే AIకి నిజంగా మానవుల్లాంటి భావోద్వేగాలు ఉన్నాయని దీని ద్వారా నిర్ధారించలేం. AI మోడళ్లు మనుషుల భావోద్వేగాలను పోలిన భాషలో స్పందించగలగడం వల్లే ఇలాంటి అనుభవాలు మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply