ఒంటి కాలిపై నిలబడే ఈ సెకన్లే మీ ఆయుష్షును చెబుతాయి! ఇందులో ఓడిపోతే పెద్ద ప్రమాదమే..

చాలామంది సిక్స్‌ప్యాక్ బాడీ ఉంటేనే పూర్తి ఆరోగ్యవంతులు అని భావిస్తారు. కానీ శాస్త్రం మాత్రం బాహ్య రూపం కంటే శరీర సమతుల్యతకే ప్రాధాన్యత ఇస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోగలడో, ఆ వ్యక్తి అంతర్గత అవయవాలు మరియు నరాలు అంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అర్థం. మయో క్లినిక్ పరిశోధకుల ప్రకారం, ఒక కాలిపై ఎంత సమయం నిలబడగలరు అనేది మీ ‘న్యూరో మస్కులర్ ఏజింగ్’ (Neuromuscular aging) కి ప్రధాన సూచిక. అంటే మీ నరాలు, కండరాలు ఎంత వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నాయో ఈ చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

వయస్సును బట్టి ఉండాల్సిన బ్యాలెన్స్ సమయం: వయస్సు పెరిగేకొద్దీ సమతుల్యత తగ్గుతుంది. అయితే ఏ వయస్సు వారు ఎంతసేపు నిలబడాలనే దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి:

  • 18 నుండి 39 ఏళ్లు: కనీసం 43 సెకన్ల పాటు ఒంటి కాలిపై నిలబడాలి. అంతకంటే తక్కువైతే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి.
  • 40 నుండి 49 ఏళ్లు: కనీసం 40 సెకన్లు బ్యాలెన్స్ చేయాలి.
  • 50 నుండి 59 ఏళ్లు: 37 సెకన్లు ఆరోగ్యకరమైన సమయంగా పరిగణించబడుతుంది.
  • 60 నుండి 69 ఏళ్లు: కనీసం 30 సెకన్లు నిలబడగలగాలి.
  • 70 నుండి 79 ఏళ్లు: ఈ వయస్సులో 18 నుండి 19 సెకన్లు నిలబడితే మంచి ఆరోగ్యం ఉన్నట్లు లెక్క.
  • 80 ఏళ్లు పైబడిన వారు: ఏ ఇతర సహాయం లేకుండా 5 సెకన్లు నిలబడితే అది సంతృప్తికరమైన స్థితి.

10 సెకన్ల ప్రమాద హెచ్చరిక: బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మధ్యవయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కేవలం 10 సెకన్లు కూడా ఒంటి కాలిపై నిలబడలేకపోతే, రాబోయే పదేళ్లలో వారు మరణించే అవకాశం ఇతరులకంటే రెట్టింపు ఉంటుంది. బలహీనమైన ఎముకలు, గుండె జబ్బుల ముప్పు, పడిపోవడం వల్ల కలిగే గాయాలకు శరీర బ్యాలెన్స్ లేకపోవడమే ప్రధాన కారణం.

సమతుల్యత ఎందుకు ముఖ్యం? మనం నడిచే వేగం లేదా చేతుల బలం కంటే శరీర సమతుల్యతను త్వరగా కోల్పోతాము. దీనిని నిలబెట్టుకోవడానికి మెదడు, కంటిచూపు, నరాల మధ్య అద్భుతమైన సమన్వయం అవసరం. ఇది కండరాల పరిమాణం కంటే నాడీ వ్యవస్థ శక్తిని ప్రతిబింబిస్తుంది. ప్రతిరోజూ కొద్దిసేపు ఒంటి కాలిపై నిలబడటం ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాలెన్స్ మెరుగుపడుతుంది, మెదడు చురుగ్గా ఉంటుంది మరియు వృద్ధాప్య సమస్యలు తగ్గుతాయి.


Posted

in

by

Tags: