ఒకప్పుడు కారు కొనడం అనేది చాలామంది భారతీయ కుటుంబాలకు అందని ద్రాక్షలా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో, తక్కువ ధరలో కారు కొనాలనే కలను నిజం చేయడంలో ‘మారుతి 800’ కీలక పాత్ర పోషించింది. 1983లో విడుదలైన ఈ కారు ఎంతోమందికి తొలి కారుగా, మరెంతోమందికి కారు కొనాలనే ఆశయానికి ప్రతీకగా నిలిచింది.
దాదాపు 30 ఏళ్ల పాటు భారత రోడ్లపై తిరిగిన మారుతి 800, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. చారిత్రక వాహనాల అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఐవీఏ (FIVA) అందించే ‘వరల్డ్ మోటరింగ్ హెరిటేజ్ అవార్డు’ను అందుకున్న తొలి భారతీయ కారుగా ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 21 చారిత్రక వాహనాల్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వాహనం మారుతి 800 కావడం విశేషం.
భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కారును తయారు చేశారు. ప్రారంభంలో ఏడాదికి 40 వేల కార్ల తయారీ సామర్థ్యంతో ఉత్పత్తి మొదలైంది. ఆ తర్వాతి 30 ఏళ్లలో 29 లక్షలకు పైగా మారుతి 800 కార్లను ఉత్పత్తి చేశారు. దీని చిన్న డిజైన్, సులభంగా నడిపే వీలు, తక్కువ ధర మధ్యతరగతి కుటుంబాల నుంచి విశేష ఆదరణను తెచ్చిపెట్టాయి.
1987 నుంచి ఈ కారును యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేశారు. హంగేరీ, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలకు మారుతి 800 కార్లను పంపారు. 2014 వరకు భారత్‌లో దీని ఉత్పత్తి కొనసాగింది. ఒక తరానికి కారు కలగా నిలిచిన ఈ వాహనానికి ఇప్పుడు లభించిన అంతర్జాతీయ పురస్కారం, భారత ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఒక ముఖ్యమైన గుర్తింపుగా నిలుస్తుంది.

Leave a Reply