ఒకప్పుడు కేవలం ₹1,500కి కొన్న పెయింటింగ్. ఇప్పుడు ఏకంగా ₹18 కోట్లకు వేలం.! 41 ఏళ్లలో ఇంత భారీగా ధర పెరిగిందా.? ఆ పెయింటింగ్‌లో అంత ప్రత్యేకత ఏముంది.?

1985లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న భారత్ భవన్‌లో ఒక పెయింటింగ్ కేవలం ₹1,500లకు అమ్ముడైంది.

అప్పట్లో ఆ పెయింటింగ్ విలువ గురించి చాలా మందికి పెద్దగా తెలియకపోయినా, 41 ఏళ్ల తర్వాత అదే కళాఖండం ముంబైలో జరిగిన వేలంలో ఏకంగా ₹18 కోట్లకు అమ్ముడైంది. ఈ పెయింటింగ్‌ను గీసినది దివంగత ప్రముఖ గోండ్ (Gond) గిరిజన కళాకారుడు ‘జన్‌గఢ్ సింగ్ శ్యామ్’ (Jangarh Singh Shyam).

ఊహించిన వేలం ధర కంటే ఈ పెయింటింగ్ ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇదే వేలంలో జన్‌గఢ్ సింగ్ శ్యామ్ గీసిన మరో ఎద్దు (Bull) పెయింటింగ్ కూడా ₹4.55 కోట్లకు అమ్ముడైంది. అయితే, ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో తమ కుటుంబానికి నేరుగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని ఆయన కుమారుడు మయాంక్ సింగ్ శ్యామ్ తెలిపారు. అయినప్పటికీ, తన తండ్రి కళకు మరియు ఆయన ఎన్నో ఏళ్ల పోరాటానికి దక్కిన అతిపెద్ద గుర్తింపుగా దీనిని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

₹18 కోట్లకు అమ్ముడైన ఈ పెయింటింగ్‌లో ప్రకృతి మరియు జీవితం మధ్య ఉన్న సంబంధాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అందులో పామును భూమాతకు ప్రతీకగా, దానిపై ఎత్తుగా నిలబడి ఉన్న ఒక పెద్ద చెట్టును ప్రకృతి మరియు ప్రాణుల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా చిత్రించారు. సమస్త జీవకోటికి భూమే ఆధారమని, దాని ద్వారానే జీవనం వృద్ధి చెందుతుందని ఈ పెయింటింగ్ తెలియజేస్తోందని మయాంక్ సింగ్ శ్యామ్ వివరించారు.

మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లా పటన్‌గఢ్ (Patangarh) గ్రామంలో జన్మించిన జన్‌గఢ్ సింగ్ శ్యామ్, గోండ్ కళను సరికొత్త రూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన ముఖ్యమైన కళాకారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1982లో ప్రముఖ కళాకారుడు జె. స్వామినాథన్ ఆయన ప్రతిభను గుర్తించి భారత్ భవన్‌కు తీసుకువచ్చిన తర్వాత, ఆయన కళకు విస్తృత గుర్తింపు లభించింది. పచ్చని ప్రకృతి, జంతువులు, దేవతలను సన్నని చుక్కలు మరియు గీతల ద్వారా అత్యంత సూక్ష్మంగా చిత్రించే ఆయన ప్రత్యేక శైలిని ఆ తర్వాత ‘జన్‌గఢ్ కలాం’ (Jangarh Kalam) అని పిలవడం ప్రారంభించారు. ఆయన పెయింటింగ్స్ భారతదేశాన్ని దాటి పారిస్, టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ కళా కేంద్రాల్లో కూడా ప్రదర్శించబడ్డాయి.


Posted

in

by

Tags: