కేరళ రాష్ట్రం కొచ్చిలో, విదేశాల్లో ఉన్న తన ప్రియుడిని నమ్మించడానికి.. తనను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన ఒక యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే: కొచ్చిలోని ఒక ఫార్మసీలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న ఆ యువతి, ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. తాను ఏడుస్తూ.. “కొందరు వ్యక్తులు నన్ను కారులో బలవంతంగా కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై నన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు” అని ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన పోలీసులు యువతిని రక్షించి, పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె చెప్పిన ప్రాంతంలోని సిసిటివి (CCTV) కెమెరాలను తనిఖీ చేశారు. అందులో ఆమె చెప్పినట్లుగా ఏ కారు రాలేదు. పైగా, ఆమె ఒక యువకుడితో కలిసి సాధారణంగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
బయటపడిన అసలు రంగు: పోలీసులు ఆ వీడియోను చూపించి గట్టిగా నిలదీయడంతో యువతి అసలు విషయాన్ని అంగీకరించింది. ఆమె ఒకే సమయంలో ఇద్దరు యువకులను ప్రేమిస్తోంది. ఒకరు స్థానికంగా ఉండగా, మరొకరు విదేశాల్లో పనిచేస్తున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి, ఆమె స్థానిక ప్రియుడితో మాట్లాడుతుండగా.. విదేశాల్లో ఉన్న ప్రియుడు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తి విదేశీ ప్రియుడితో మాట్లాడుతుండగా, పక్కనే ఉన్న స్థానిక ప్రియుడి గొంతు అవతలి వ్యక్తికి వినిపించింది.
“నీ పక్కన ఉన్నది ఎవరు?” అని విదేశీ ప్రియుడు అనుమానంతో ప్రశ్నించగా, దొరికిపోతానేమోనన్న భయంతో ఆమె తక్షణమే ‘కిడ్నాప్’ కథను అల్లింది. “ఎవరో నన్ను కిడ్నాప్ చేస్తున్నారు” అని ఫోన్లో అరిచి కాల్ కట్ చేసింది. ఈ అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి పోలీసులకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.
వృథాగా పోలీసులను తిప్పించడం, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
