భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేలా భారత సైన్యం తన ట్యాంక్ దళాలలో డ్రోన్ సాంకేతికతను చేర్చి, ‘శౌర్య స్క్వాడ్రన్’ (Shaurya Squadron) అనే కొత్త విభాగాన్ని సృష్టించింది.
ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను గమనిస్తే.. కేవలం ట్యాంకులు మాత్రమే సరిపోవని, డ్రోన్ల పాత్ర అత్యంత కీలకమని నిరూపితమైంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం సుమారు ఆరు ‘శౌర్య’ దళాలను సిద్ధం చేసి వివిధ కమాండ్ సెంటర్లకు పంపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బాబినాలో జరిగిన ‘అమోఘ్ జ్వాల’ విన్యాసాల సమయంలో, ట్యాంకులతో కలిసి డ్రోన్లు శత్రువుల లక్ష్యాలను ఎంత ఖచ్చితంగా తాకగలవో నిరూపించబడింది.
శౌర్య స్క్వాడ్రన్ పనితీరు: ఈ శౌర్య దళం యుద్ధభూమిలో ముందు వరుసలో ఉండే 10-12 ట్యాంకులతో కలిసి పనిచేస్తుంది. ఇందులో ఉండే సైనికులకు డ్రోన్లను ఆపరేట్ చేయడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా, నిఘా మరియు దాడులు చేసే అత్యాధునిక డ్రోన్లను అందించారు.
ఇవి శత్రువుల కదలికలను కనిపెట్టడమే కాకుండా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (Electronic Warfare), మందుపాతరలను తొలగించడం మరియు వైద్య సహాయం వంటి పనులకు కూడా ఉపయోగపడతాయి. భారత సైన్యం వద్ద ఉన్న టి-90 భీష్మ మరియు అర్జున్ వంటి 5,000 కంటే ఎక్కువ ట్యాంకుల దాడి సామర్థ్యాన్ని ఈ డ్రోన్ టెక్నాలజీ అనేక రెట్లు పెంచుతుందని భావిస్తున్నారు.
