“ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు రౌడీలు..!” బెయిల్‌పై వచ్చిన 2 వారాల్లోనే ఘోరం.. నడిరోడ్డుపై రక్తపు మడుగులో ముగిసిన ముక్కోణపు ప్రేమకథ..!!

మహారాష్ట్రలో, బెయిల్‌పై బయటకు వచ్చిన రౌడీ గౌరవ్ పంకజ్ రగ్డేను, అతని స్నేహితుడు మరియు సహచర రౌడీ గౌరవ్ రావత్, అతని అనుచరుడు కలిసి కత్తితో పొడిచి చంపారు.

హత్యకు గురైన రగ్డేపై హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి 9కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఈ హత్యలో సంబంధం ఉన్న రావత్, అతని అనుచరుడు అభిషేక్ వాస్నిక్ ఇద్దరిపై కూడా ఇప్పటికే హత్య కేసులు నమోదై ఉన్నాయి.

ఒకే యువతిని ఇద్దరూ ప్రేమించడమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ‘రాణి’ అనే యువతిని రగ్డే ప్రేమిస్తుండగా, అతను జైలులో ఉన్న సమయంలో రావత్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. నేర ప్రపంచం నుంచి బయటపడాలని భావించిన ఆ యువతి, రావత్‌తో కలిసి ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వహిస్తోంది. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన రగ్డేకు ఈ విషయం తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

ఘటన జరిగిన రోజు ఆ యువతి రావత్ ఇంటికి వెళ్లిన సమయంలో, మద్యం మత్తులో అక్కడికి వచ్చిన రగ్డే ఇంటిపై రాళ్లు రువ్వి, సామాన్లను ధ్వంసం చేస్తూ గొడవకు దిగాడు. ప్రాణభయంతో పెరటి ద్వారం గుండా పారిపోయిన రావత్, అతని స్నేహితులను రగ్డే కక్షతో వెంబడించాడు. ఆ సమయంలో వారి మధ్య జరిగిన పెనుగులాటలో రగ్డే కింద పడిపోయాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న రావత్ అనుచరుడు వాస్నిక్, రగ్డే చేతిలోని కత్తిని లాక్కుని అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రగ్డే రక్తపు మడుగులో కుప్పకూలడంతో ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. దీన్ని గమనించిన గస్తీ తిరుగుతున్న ఓ కానిస్టేబుల్ దాదాపు 1.5 కిలోమీటర్ల మేర వెంబడించి, దాడికి ఉపయోగించిన కత్తితో సహా రావత్‌ను పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన రగ్డే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

గొడవ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, హత్య మరొక పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కేసు ఎక్కడ నమోదు చేయాలనే దానిపై పోలీసుల్లో కాసేపు గందరగోళం నెలకొంది. చివరకు బెల్తరోడి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి, ఈ ఘటనతో సంబంధమున్న ఇతర వ్యక్తుల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: