రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి 20 ఏళ్ల కూతురు సహా ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అశోక్ శర్మ (59), ఆయన భార్య ఇందిరా శర్మ (52), కూతురు దీక్షా శర్మ (20) అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ ముగ్గురూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రాథమిక విచారణలో, ఆ ముగ్గురూ విషం సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అశోక్ శర్మ కుమారుడు గౌరవ్ ఇంట్లోని మరో గదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ పరీక్షించిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ఒక ఫోన్ కాల్ పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. విషం తీసుకున్న తర్వాత, కుటుంబ సభ్యులు తమ బంధువు నిర్మల్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ కాల్లో తాము తీసుకున్న నిర్ణయం గురించి వారు చెప్పారని పోలీసులు తెలిపారు. దీంతో నిర్మల్, దగ్గర్లో నివసించే ఒకరిని వెంటనే వారి ఇంటికి వెళ్లి చూడాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా, పోస్ట్‌మార్టం నివేదిక, పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.

Leave a Reply