బీహార్‌లోని వైశాలి జిల్లా, రాఘోపుర్ పరిధిలోని గంగా నదిలో చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కళ్లముందే కన్నబిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇంతమంది పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చేందుకు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నదిలో పడవ బోల్తా పడటంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నీట మునిగిన వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో.. తమ పిల్లలు బతికున్నారో లేదో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో అల్లాడిపోయారు. చివరకు పిల్లలంతా ప్రాణాలు కోల్పోయారని తెలియడంతో కుటుంబ సభ్యులు పెట్టిన రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. ఒకే ఇంటికి చెందిన చిన్నారులంతా ఒకేసారి మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబాన్నే కాకుండా యావత్ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌ను చూసి బంధువులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. కొందరు ఆయన్ను పట్టుకుని గుండెలవిసేలా విలపించారు. పిల్లలను కోల్పోయిన తల్లుల ఆర్తనాదాలు విని అక్కడున్న అధికారులు, స్థానికులు సైతం కంటతడి పెట్టారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు అధికారులు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అయితే, ఈ పడవ ప్రమాదం ఎలా జరిగింది? పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించారా? సరైన భద్రతా ప్రమాణాలు పాటించారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పడవలోకి నీరు చేరడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన కొందరు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు అధికారిక విచారణ తర్వాతే తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది చిన్నారులను బలితీసుకున్న ఈ విషాద ఘటన.. జలరవాణాలో భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది.

Leave a Reply