ఒకే దెబ్బకు ఇద్దరు భర్తలు.. పెళ్లి పేరుతో రూ.15 లక్షల మోసం! దీపావళికి కూడా భార్య రాకపోవడంతో అనుమానం.. ఇంటికి వెళ్లిన ఇద్దరు భర్తలకు షాక్!

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ పెళ్లి మోసం కలకలం రేపుతోంది. ఒకే యువతి ఇద్దరిని వివాహం చేసుకుని, పెళ్లి ఖర్చుల పేరుతో సుమారు రూ.15 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీపావళి పండుగకు కూడా భార్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. ఆమె ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.

కోవిల్‌పట్టికి చెందిన 23 ఏళ్ల కార్తికకు, తంజావూరుకు చెందిన 36 ఏళ్ల సిద్ధార్థన్‌తో సెప్టెంబర్ 13న తంజావూరులో ఘనంగా వివాహం జరిగింది.

ఈ పెళ్లి కోసం మధ్యవర్తులకు రూ.3 లక్షలు చెల్లించడంతో పాటు, వధువుకు మూడు సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు సిద్ధార్థన్ కుటుంబం తెలిపింది. మొత్తం మీద వివాహానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

అయితే పెళ్లయిన రెండో రోజే, తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి కార్తిక కోవిల్‌పట్టికి వెళ్లిపోయింది. ఆ తర్వాత తిరిగి భర్త ఇంటికి రాలేదు.

దీపావళి పండుగకు కూడా భార్య రాకపోవడంతో సిద్ధార్థన్‌కు అనుమానం కలిగింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి కోవిల్‌పట్టిలోని కార్తిక ఇంటికి వెళ్లాడు. అక్కడ కార్తిక కనిపించకపోవడంతో వారు ఆశ్చర్యపోయారు.

ఇంతలో నామక్కల్‌కు చెందిన 37 ఏళ్ల రంజిత్‌కుమార్ కూడా అదే ఇంటికి వచ్చాడు. నవంబర్ 1న కోవిల్‌పట్టిలోని ఓ ఆలయంలో కార్తికను తాను వివాహం చేసుకున్నానని, ఆమె కోసం వెతుకుతున్నానని చెప్పడంతో సిద్ధార్థన్ కుటుంబానికి మరో షాక్ తగిలింది.

కార్తిక తల్లిదండ్రులమని చెప్పుకున్న మునీశ్వరి, మారియప్పన్‌లను ఇద్దరూ ప్రశ్నించగా, వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మొదట తాను మధ్యవర్తినని చెప్పిన మారియప్పన్, ఆ తర్వాత మునీశ్వరి భర్తనని చెప్పుకున్నాడు. కార్తిక తన బామ్మను చూడటానికి తూత్తుకుడి ఆసుపత్రికి వెళ్లిందని కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో తాము మోసపోయామని భావించిన సిద్ధార్థన్, రంజిత్‌కుమార్‌లు కోవిల్‌పట్టి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు ఆధారంగా కార్తిక, మారియప్పన్, మునీశ్వరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఇదే తరహాలో మరెవరినైనా పెళ్లి పేరుతో మోసం చేసిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *