జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కేరళలో జరిగిన ఓ అరుదైన సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కేరళలోని కోటాయం జిల్లా తిరువంచూర్కు చెందిన అనిల్‌కుమార్–సూర్య దంపతులకు ఆదిరా, ఆర్య అనే కవల కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం 25 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చిన్నప్పటి నుంచే ఎంతో సన్నిహితంగా ఉండేవారు.
చదువు విషయంలోనూ ఇద్దరూ ఒకే దారిలో ప్రయాణించారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఇద్దరూ నర్సింగ్ కోర్సులో చేరి, దానిని పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరూ కలిసి పనిచేశారు.
చదువు, ఉద్యోగంలోనే కాదు.. వారి వివాహ జీవితంలో కూడా ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది.
2022 ఏప్రిల్ 17న ఆదిరా, ఆర్యలకు ఒకే రోజున ఘనంగా వివాహం జరిగింది. ఆదిరా.. అఖిలేష్కుమార్ను, ఆర్య.. శిరన్ మోహన్‌ను వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత ఇద్దరూ తమ భర్తలతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఆదిరా ఖతార్‌లోని దోహాలో ఓ క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తుండగా, ఆర్య ఒమన్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం కొనసాగించారు.
ఇక ఇప్పుడు ఈ కవల సోదరీమణుల జీవితంలో మరో అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
ఇద్దరికీ దాదాపు ఒకే సమయంలో గర్భం దాల్చగా.. గత నెల 9న కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
దీంతో ఒకే రోజు పుట్టిన ఈ కవల సోదరీమణులు.. ఒకే రోజు పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు ఒకే రోజున తల్లులుగా మారడం విశేషంగా మారింది.
ఇటీవల తమ పిల్లలకు నామకరణం చేసేందుకు ఇద్దరూ భర్తలు, పిల్లలతో కలిసి స్వస్థలమైన కోటాయం జిల్లా తిరువంచూర్కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆర్య–శిరన్ మోహన్ దంపతులు తమ కుమార్తెకు ‘నితారా’ అని పేరు పెట్టగా.. ఆదిరా–అఖిలేష్‌కుమార్ దంపతులు తమ కుమార్తెకు ‘నివేద్యా’ అని పేరు పెట్టారు.
కవలలుగా ఒకే సమయంలో జన్మించిన ఈ ఇద్దరు సోదరీమణులు.. ఒకే రోజు పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఒకే రోజున తల్లులుగా మారడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఈ అరుదైన సంఘటన ప్రస్తుతం కేరళలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply