బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని నమ్మిన పెట్టుబడిదారులకు గత శుక్రవారం ఒక ‘బ్లాక్ ఫ్రైడే’ (Black Friday) అని చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే బంగారం ధరలు భారీగా పడిపోవడం మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది.
చారిత్రాత్మక పతనం: గణాంకాల ప్రకారం.. 1980 తర్వాత బంగారం ఇంత పెద్ద పతనాన్ని చూడటం ఇదే మొదటిసారి. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా 36% వరకు తగ్గింది. ఇది పెట్టుబడి పెట్టడానికి దొరికిన సువర్ణావకాశమా? లేక పతనం ఇప్పుడే మొదలైందా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.
పతనానికి కారణాలు: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో, లాభాలను దక్కించుకోవడానికి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు (Profit Booking) పాల్పడటమే ఈ పతనానికి ప్రధాన కారణం. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధర ఒకానొక దశలో 11.4% తగ్గి 4,745 డాలర్లకు చేరుకుంది.
వెండి ధరలో భారీ తగ్గుదల: బంగారం కంటే వెండి ధర మరింత ఘోరంగా పడిపోయింది. ఒక్కరోజే వెండి ధర 35.9% తగ్గి 78.53 డాలర్లకు చేరుకుంది. వెండి చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనంగా నమోదైంది. ఇదే క్రమంలో పల్లాడియం 15%, ప్లాటినం 17% మేర తగ్గాయి.
నిపుణుల హెచ్చరిక: ఆర్.ఎస్.ఐ (RSI) వంటి సాంకేతిక సూచీలు బంగారం ధరలు ఇప్పటికే ప్రమాదకర స్థాయికి (Overbought zone) చేరుకున్నాయని హెచ్చరించాయి. సాధారణంగా RSI 70 దాటితేనే ప్రమాదకరమని భావిస్తారు, కానీ బంగారం విషయంలో ఇది 90కి చేరింది. అందుకే ఈ ధరల సర్దుబాటు తప్పనిసరి అయింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు మరింతగా తగ్గే అవకాశం తక్కువని, ఇది కేవలం తాత్కాలిక లాభాల స్వీకరణ మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
