మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో విశ్రాంత ఐఏఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ హత్య కేసులో, సుమారు నెల రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వరుణ్ కుమార్‌ను యూపీలోని ఆగ్రాలో పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని భోపాల్‌కు తీసుకువెళుతుండగా, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించినట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో తుపాకీ పేలి అతడి కుడి కాలికి బుల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. దీంతో అతడిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని హమీదియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 2 సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో వరుణ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతడిని రోడ్డు మార్గంలో భోపాల్‌కు తీసుకువెళ్లారు. నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో, ముగాలియా ఛాప్ ప్రాంతంలోని నీల్జీ నది సమీపంలో వాహనాన్ని ఆపాలని వరుణ్ కోరినట్లు సమాచారం. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అతడిని వాహనం నుంచి దించుతున్న సమయంలో, ఓ కానిస్టేబుల్ నడుము వద్ద ఉన్న ప్రభుత్వ తుపాకీని లాక్కొని పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు యత్నించాడని అధికారులు తెలిపారు.
దీంతో పోలీసులకు, వరుణ్‌కు మధ్య పెనుగులాట జరిగింది. ఆ ఘర్షణలో తుపాకీ పేలి, వరుణ్ కుడి కాలి మోకాలి సమీపంలో బుల్లెట్ దిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వరుణ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని 109(1), 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గత సెప్టెంబర్ 30వ తేదీన భోపాల్‌లోని సూరజ్ నగర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో విశ్రాంత ఐఏఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ గొంతు కోసిన స్థితిలో విగతజీవిగా కనిపించారు. ఆయనకు కేర్‌టేకర్‌గా, నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేందుకు వరుణ్ కుమార్‌ను హత్య జరగడానికి మూడు రోజుల ముందే ఓ ఏజెన్సీ ద్వారా నియమించారు. హత్య అనంతరం అతడు పరారీ కావడంతో, పోలీసులు వివిధ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని పట్టుకునేందుకు రూ.50,000 రివార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం అతడు పట్టుబడటంతో, ఈ దారుణ హత్యకు గల కారణాలు, ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply