సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియా) కేవలం లైక్స్, వ్యూస్ మరియు ఫాలోవర్లను సంపాదించాలనే పిచ్చితో జనాలు ఏ స్థాయికైనా తెగిస్తారనడానికి నిదర్శనంగా ఒక ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఒక తండ్రి తన సొంత బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టి అత్యంత ప్రమాదకరమైన రీతిలో రీల్స్ (Reels) వీడియో తీసిన షాకింగ్ ఉదంతం ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఒక చిన్న బాలుడు తన చేతిలో భారత జాతీయ జెండాను పట్టుకుని, ఇంటి పై అంతస్తు (బాల్కనీ) గోడపై నిలబడి ఉన్నాడు. కింద అతని తండ్రి ఆ పిల్లాడిని పట్టుకోవడానికి రెండు చేతులూ చాచి సిద్ధంగా నిలబడగా.. తరువాతి కొన్ని సెకన్లలోనే ఆ బాలుడు ఎలాంటి భయం లేకుండా బాల్కనీ పైనుంచి కిందకు దూకేశాడు.
బిడ్డ ప్రాణాలతో ఆటలు – నెటిజన్ల ఆగ్రహం:
కింద నిలబడిన ఆ వ్యక్తి, పైనుంచి పడిన ఆ పసిగుడ్డును ఒక బంతిని క్యాచ్ పట్టినట్లు గాల్లోనే ఎంతో లాఘవంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పిల్లాడిని మరో రెండు సార్లు గాల్లోకి విసిరేస్తూ కెమెరా వైపు చూసి వికృతానందంతో తన సంతోషాన్ని చాటుకున్నాడు.
ఒకవేళ నూలుపోగు అంత తేడాతో క్యాచ్ మిస్ అయినా లేదా చేతిలోంచి ఆ పిల్లాడు జారి కింద పడినా.. ఆ చిన్నారి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఈ ప్రమాదకరమైన స్టంట్‌ను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇదేం పిచ్చితనం అంటూ ఆ బాధ్యతారహితమైన తండ్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఇలాంటి ప్రవర్తన ఒక తీవ్రమైన మానసిక రోగమని, వ్యూస్ కోసం కన్నబిడ్డల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి బాధ్యతారహితమైన తల్లిదండ్రులకు చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
