అనిరుధ్ – కావ్య మారన్ వివాహం కోసం ఎంచుకున్న వేదిక సాధారణమైనది కాదు. సముద్ర తీరాన రాజభవనంలా వెలిగిపోతున్న ఈ లగ్జరీ హోటల్‌లో ఒక్క రోజు బస చేయడానికే లక్షలాది రూపాయలు ఖర్చవుతుందన్న విషయం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహ యజమాని కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ ప్రైవేట్ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. కాగా, వీరి వివాహ విందు (రిసెప్షన్) నవంబర్ 21న చెన్నైలో జరగనుంది.
ఈ వివాహం జరిగిన వేదిక ఏథెన్స్ తీర ప్రాంతంలో ఉన్న ‘ఫోర్ సీజన్స్ అస్తిర్ ప్యాలెస్’ (Four Seasons Astir Palace) లగ్జరీ రిసార్ట్. సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ 1960వ దశకంలో ప్రారంభమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ సతీమణి జాక్వెలిన్ కెన్నెడీ సహా ఎందరో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులకు ఇది ఇష్టమైన విడిదిగా ఉండేది. ఆధునిక హంగులతో పునరుద్ధరించిన తర్వాత 2019లో ‘ఫోర్ సీజన్స్’ హోటల్‌గా ఇది తిరిగి ప్రారంభమైంది. ఇందులో 300కు పైగా గదులు, ప్రైవేట్ హెలిప్యాడ్, సొంత బీచ్‌లు వంటి ఎన్నో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి.
ఈ హోటల్‌లో ఒక రాత్రి బస చేయడానికి అయ్యే ఖర్చు గది రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సముద్రపు అందాలు కనిపించే సాధారణ గది అద్దె సుమారు రూ. 65,542 నుంచి ప్రారంభమవుతుంది. స్విమ్మింగ్ పూల్‌తో కూడిన లగ్జరీ గదికి సుమారు రూ. 4.83 లక్షలు కాగా, అత్యంత విలాసవంతమైన గదుల్లో ఒకటైన ‘అంబాసిడర్ సూట్’కు ఏకంగా రూ. 11.26 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. వీటితో పాటు తొమ్మిది రెస్టారెంట్లు, లాంజ్‌లు, మూడు ప్రైవేట్ ఇసుక బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, స్పా వంటి సకల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తేదీలు, గదుల లభ్యతను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.

Leave a Reply