మలయాళ చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకుడు, భారతీయ సినీ దిగ్గజం మమ్ముట్టి అర్ధరాత్రి వేళ దారితప్పి ఇబ్బంది పడుతున్న సమయంలో.. తమిళనాడుకు చెందిన ఒక యువకుడు ఏకంగా 10 కిలోమీటర్లు బైక్‌పై ముందు వెళ్తూ దారి చూపించిన హృద్యమైన సంఘటన నెట్టింట వైరల్ అవుతూ అందరి మనసులను గెలుచుకుంటోంది.
కారైక్కుడి పరిసరాల్లో తన తాజా సినిమా షూటింగ్ ముగించుకుని, తెల్లవారుజామున కారులో కేరళకు బయలుదేరిన మమ్ముట్టికి.. తిరుపత్తూరు సమీపంలో ప్రధాన రహదారి మూసివేసి ఉండటంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. టెక్నాలజీ యుగంలో గూగుల్ మ్యాప్స్ (Google Maps) కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గం తెలియక మమ్ముట్టి మరియు ఆయన టీమ్ రోడ్డుపై అయోమయంలో పడ్డారు.
తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పట్టమంగళం ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపి దారి అడిగేందుకు ప్రయత్నించినప్పుడు ఈ మరపురాని సన్నివేశం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ‘పాండియన్’ అనే తమిళ యువకుడు, కారులో ఉన్నది దిగ్గజ నటుడు మమ్ముట్టి అని గుర్తించి ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
గూగుల్ మ్యాప్స్‌లో కనిపించని గ్రామీణ అంతర్గత దారులు, సందుల గుండా తన బైక్‌పై ముందు వెళ్తూ.. సుమారు 10 కిలోమీటర్ల మేర దారి చూపిస్తూ మమ్ముట్టి కారును సురక్షితంగా ప్రధాన హైవేకి చేర్చాడు.
తాను ఇంతటి మహానటుడిననే ఎలాంటి గర్వం లేకుండా, తనకు సహాయం చేసిన ఆ యువకుడిని మమ్ముట్టి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. “ఇతను నా స్నేహితుడు” అని మురిపెంగా చెబుతూ ఆ యువకుడి మొబైల్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగారు.
నిర్మాత ఆంటో జోసెఫ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అర్ధరాత్రి వేళ మానవత్వంతో ఆదుకున్న యువకుడు పాండియన్‌తో పాటు, మమ్ముట్టి చూపిన నిరాడంబరతపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
