ఒక చిలుకను కనిపెట్టడానికి రూ.11 వేల బహుమతా? కాశీ వీధుల్లో వెలిసిన పోస్టర్లతో కలకలం.. ఆ చిలుకపై కుటుంబానికి ఎందుకింత ప్రేమ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి తారానగర్ ప్రాంతంలో నివసిస్తున్న అరవింద్ మౌర్య కుటుంబం, గత 10 సంవత్సరాలుగా ‘అలెక్స్’ అనే చిలుకను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది.

ఇంట్లో ఒక సభ్యుడిలా కలిసిపోయిన ఆ చిలుక, గత నవంబర్ 16న ఇంట్లో టైల్స్ వేసే పనులు జరుగుతున్నప్పుడు యంత్రాల శబ్దానికి భయపడి బాల్కనీ నుండి ఎగిరిపోయింది. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినప్పటికీ ఆ చిలుక ఆచూకీ లభించలేదు.

దీంతో అలెక్స్‌ను తిరిగి కనుగొనడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిలుక ఫోటో, వివరాలతో కాశీ నగరం అంతటా పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా, అలెక్స్‌ను కనిపెట్టి సమాచారం ఇచ్చిన వారికి రూ.11,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. గత పదేళ్లుగా కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా ఉన్న చిలుక కనిపించకపోవడంతో ఇంట్లోని వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కూడా ప్రతిరోజూ అలెక్స్‌తో కలిసి ఆడుకునేదని, ఇప్పుడు చిలుక లేకపోవడంతో ఆ కుక్క కూడా దిగాలుగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కూడా 2019లో అలెక్స్ ఇంటి నుండి ఎగిరిపోయింది. అప్పుడు చాలా చోట్ల వెతికిన కుటుంబ సభ్యులు, ఖజూరి ప్రాంతంలో దానిని కనుగొని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో చిలుకను కనిపెట్టిన వ్యక్తికి రూ.5,100 బహుమతిగా అందించారు.

ఈసారి కూడా అలెక్స్ దొరకకపోతే బహుమతి మొత్తాన్ని రూ.21,000కు పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పెంపుడు చిలుక మళ్లీ ఇంటికి తిరిగి వస్తుందన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. ఒక చిలుక కోసం వారణాసి అంతటా పోస్టర్లు వేయడం, భారీ బహుమతి ప్రకటించడం స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *