ఒక చేయి లేకపోయినా.. తన సంగీతంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మహిళ.! కృత్రిమ చేతితో వయోలిన్ వాయించి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న జపాన్ కళాకారిణి. ప్రమాదాన్నే విజయంగా మార్చిన స్ఫూర్తిదాయక కథ.!!

జపాన్‌కు చెందిన 42 ఏళ్ల సంగీత కళాకారిణి మనామి ఇటో (Manami Ito), కృత్రిమ చేతిని ఉపయోగించి వయోలిన్ వాయించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

ఆమె అసాధారణ ప్రతిభను, పట్టుదలను ప్రశంసిస్తూ.. 2027 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో ఆమె పేరును అధికారికంగా పొందుపరిచారు. పూర్తిస్థాయి కృత్రిమ చేతితో వయోలిన్ వాయించిన తొలి కళాకారిణిగా ఆమె అరుదైన ఘనత సాధించారు.

చిన్నప్పటి నుంచే వయోలిన్ వాయించడంపై మక్కువ పెంచుకున్న మనామి ఇటో జీవితంలో.. 2004లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెద్ద కుదుపును మిగిల్చింది. ఆ ప్రమాదంలో ఆమె తన కుడి చేతిని కోల్పోయారు. దీంతో తన సంగీత ప్రయాణం ముగిసిపోయిందని ఆమె మొదట్లో భావించారు. కనీసం రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

అయితే, ఏమాత్రం కుంగిపోని ఆమె తన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ చేతిని అమర్చుకుని మళ్లీ వయోలిన్ వాయించడం సాధన చేయడం మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి చేసిన కఠోర సాధన ఫలితంగా, 2012 ఆగస్టు 5న జపాన్‌లోని కోబే నగరంలో జరిగిన ఓ వైద్య సదస్సులో ప్రేక్షకుల ముందు వయోలిన్ వాయించి అందరినీ అబ్బురపరిచారు. ఒకప్పుడు ఇతరులు తనను చూడటానికే ఇష్టపడని పరిస్థితి నుంచి, బహిరంగ వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంతో సంగీత కచేరీ చేసే స్థాయికి ఆమె ఎదిగారు.

తన ఈ ప్రయాణానికి తన తల్లి మాటలే ప్రధాన కారణమని మనామి తెలిపారు. ప్రమాదం తర్వాత తాను ఇక వయోలిన్ వాయించలేదేమో అని తల్లి ఎంతో బాధపడినప్పటికీ.. ఏదో ఒక రోజు తన కోసం వయోలిన్ వాయించాలన్న తల్లి కలను నెరవేర్చాలన్న దృఢ సంకల్పమే తనను మళ్లీ సంగీత ప్రయాణం వైపు అడుగులు వేసేలా చేసిందని ఆమె చెప్పారు. వయోలిన్ కళాకారిణిగానే కాకుండా, జపాన్‌లో కృత్రిమ చేతితో పనిచేసిన తొలి నర్సుగా, పారాలింపిక్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణిగా కూడా ఆమె ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *