కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచంలో ఆసక్తి రేకెత్తించే విధంగా, ఆంత్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన ‘క్లాడ్’ (Claude) AIని ఉపయోగించి ఓపెన్ఏఐ (OpenAI) లోని కొన్ని భద్రతా లోపాలను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు.
హాక్ట్రాన్ ఏఐ (Hacktron AI) సంస్థకు చెందిన ముగ్గురు పరిశోధకులు నిర్వహించిన ఈ పరీక్షలో, OpenAI ఉద్యోగుల కొన్ని ChatGPT మరియు Codex ఖాతాలకు వారు యాక్సెస్ పొందగలిగారని తెలిసింది. సైబర్ సెక్యూరిటీ పరిశోధనల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ఎంతటి సామర్థ్యాన్ని సంతరించుకున్నాయో ఈ ఘటన ద్వారా స్పష్టమైంది.
ఈ సంఘటన ఒక సాధారణ హ్యాకింగ్ దాడి కాదు. ఓపెన్ఏఐ భద్రతా లోపాలను గుర్తించే ఉద్దేశ్యంతో చేపట్టిన పరిశోధనలో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు. పరిశోధకులు క్లాడ్ AIని ఉపయోగించి OpenAI కమ్యూనిటీ ఫోరమ్‌లోని ఒక భద్రతా లోపాన్ని మొదటగా గుర్తించారు. ఆ తర్వాత దాని ఆధారంగా మరికొన్ని భద్రతా లోపాలను అనుసంధానం చేసుకుంటూ వెళ్లి ఉద్యోగుల ఖాతాలకు యాక్సెస్ పొందినట్లు సమాచారం.
పరిశోధకుల వివరాల ప్రకారం, ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 72 గంటల కంటే తక్కువ సమయమే పట్టింది. ఒక ఉద్యోగి ఖాతాకు అనుసంధానమై ఉన్న Codex ద్వారా OpenAI ఇంటర్నల్ కోడ్ రిపోజిటరీ (అంతర్గత కోడింగ్ నిల్వ కేంద్రం)కి యాక్సెస్ లభించిందని తెలిపారు. అయితే, తమకు యాక్సెస్ లభించిందని నిరూపించడానికి మాత్రమే.. ఎలాంటి నష్టం కలిగించని ఒక చిన్న మార్పు అభ్యర్థనను (Change Request) సమర్పించినట్లు పేర్కొన్నారు. ఇతర అనుసంధానిత సేవలకు కూడా యాక్సెస్ లభించే అవకాశం ఉన్నప్పటికీ, పరిశోధకులు వాటి జోలికి వెళ్లలేదు.
భద్రతా లోపాలను గుర్తించిన వెంటనే పరిశోధకులు OpenAI కి సమాచారం అందించారు. స్పందించిన OpenAI ఈ సమస్యలను వెంటనే పరిష్కరించిందని, అలాగే Hacktron AI పరిశోధకులకు 6,500 డాలర్ల బగ్ బౌంటీని (బహుమతిని) అందజేసిందని సమాచారం. కృత్రిమ మేధస్సు సాధనాలు ఒకవైపు సైబర్ భద్రతను పరీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ, వాటి సామర్థ్యం గనుక దుర్వినియోగం అయితే కొత్త రకమైన సైబర్ భద్రతా సవాళ్లు కూడా తలెత్తుతాయనడానికి ఈ ఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనం.

Leave a Reply