ఒడిశా విషాదం: కళ్ళముందే విగతజీవిగా తండ్రి.. అపస్మారక స్థితిలో తల్లి.. రాత్రంతా అడవిలో కాపలా కాసిన ఐదేళ్ల చిన్నారి!

ఒడిశా: ఒడిశాలో సభ్య సమాజం నివ్వెరపోయే ఒక అత్యంత విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎముకలు కొరికే చలిలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఒక ఐదేళ్ల బాలుడు తన మరణించిన తండ్రి మరియు అపస్మారక స్థితిలో ఉన్న తల్లి పక్కనే కూర్చుని రాత్రంతా కాపలా కాశాడు. ఆదివారం ఉదయం ఆ చిన్నారి అడవిలో నుండి బయటకు వచ్చి దారిపోయే వారిని సహాయం కోరడంతో ఈ ఘోరం బయటపడింది.

అసలేం జరిగిందంటే? ఈ ఘటన ఒడిశాలోని దేవగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. జియానంతపాలి గ్రామానికి చెందిన దుష్మంత్ మాఝీ మరియు రింకీ మాఝీ దంపతులు తమ ఐదేళ్ల కుమారుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. దారిలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో, వారు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాలని నిర్ణయించుకున్నారు. రహదారి పక్కనే బైక్ నిలిపివేసి, అడవిలోకి సుమారు ఒక కిలోమీటర్ దూరం నడిచి వెళ్లారు. అక్కడ దంపతులిద్దరూ తమతో పాటు బాలుడికి కూడా విషం ఇచ్చి, తాము కూడా తాగారు.

రాత్రంతా ఒంటరిగా.. దేవగఢ్ అదనపు ఎస్పీ ధీరజ్ చోప్దార్ తెలిపిన వివరాల ప్రకారం, విషం తాగిన ఒక గంటలోనే దుష్మంత్ మరణించాడు. భార్య రింకీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ చిన్నారికి ఏం జరుగుతుందో అర్థం కాక, నేలపై పడి ఉన్న తల్లిదండ్రుల వద్దే కూర్చుండిపోయాడు. క్రూర మృగాలు తిరిగే ఆ అడవిలో, గడ్డకట్టే చలిలో ఆ పసివాడు రాత్రంతా తన తల్లిదండ్రులకు కాపలాగా ఉన్నాడు. సూర్యోదయం అయ్యాక అడవిలో నుండి రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న వారిని సహాయం కోసం పిలిచాడు.

ముగిసిన మరో ప్రాణం: స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అంగుల్ జిల్లాలోని ఛెందీపాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దుష్మంత్ మరణించగా, చికిత్స పొందుతూ తల్లి రింకీ కూడా ప్రాణాలు విడిచింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. వైద్యులు బాలుడికి ప్రాథమిక చికిత్స అందించి, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అనంతరం ఆ బాబును తాతామామలకు అప్పగించారు.


Posted

in

by

Tags: