మస్కట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఒమన్ పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రశ్న బాగా వైరల్ అయ్యింది. ఆయన కుడి చెవికి ఉన్న ఆ చిన్న పరికరం ఏమిటి? అది చూడటానికి ఒక కమ్మలా ఉండటంతో.. మోదీ ఏదైనా కొత్త ఫ్యాషన్ స్టైల్ మొదలుపెట్టారా అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు.
దుస్తుల విషయంలో ఎప్పుడూ వైవిధ్యం చూపే మోదీ ‘కొత్త స్టైల్’ అని ఇది క్షణాల్లో వైరల్ అయినప్పటికీ, వాస్తవానికి అది ఫ్యాషన్ కోసం ధరించిన ఆభరణం కాదు. ఉన్నత స్థాయి దౌత్య చర్చల సమయంలో ఉపయోగించే అత్యున్నత సాంకేతికత కలిగిన ‘రియల్ టైమ్ ట్రాన్స్లేషన్’ (Real-time Translation) పరికరం అది. విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌తో భేటీ అయిన సమయంలో మోదీ దీనిని ధరించారు.
భాషా అడ్డంకులను తొలగించే టెక్నాలజీ
అరబిక్ భాషలో మాట్లాడే ఒమన్ ప్రతినిధుల మాటలను వెనువెంటనే అనువదించి వినడానికి ఈ సాంకేతికత మోదీకి సహాయపడింది. దౌత్యపరమైన చర్చల్లో భాషా పరమైన అడ్డంకులు లేకుండా సమాచారాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఆధునిక పరికరాలను ఉపయోగిస్తుంటారు.
భారత – ఒమన్ సంబంధాల బలోపేతం
ఈ పర్యటనలో భారత్-ఒమన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా భారత ఎగుమతులకు 98% వరకు సుంకం లేని ప్రాప్యతను కల్పించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇందులో ప్రధానమైనది. మోదీ తిరుగు ప్రయాణానికి ముందు, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆయనకు ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ ప్రదానం చేసి గౌరవించారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి, నమ్మకానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
