“ఒరేయ్… ఆకలితో వీడు చస్తే ఎవరిదిరా బాధ్యత?!” దొంగతనానికి వచ్చినోడికి అన్నం పెట్టి ఆదరించిన తాత! జనం నవ్వులు… ఏడుస్తూ తింటున్న దొంగ! నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో!

సోషల్ మీడియాలో దొంగలు దొరికితే జనం చితక్కొట్టే వీడియోలు ఎన్నో చూసుంటాం. కానీ నెట్టింట తాజాగా చక్కర్లు కొడుతున్న ఒక వీడియో.. పల్లెటూరి జనం అమాయకత్వాన్ని, వారిలోని సహజసిద్ధమైన మానవత్వాన్ని చాటిచెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

బీహార్‌లోని ఓ గ్రామంలో దొంగతనానికి వచ్చిన దొంగను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతడిని చితకబాదడం పక్కనపెట్టి, కడుపునిండా కూరలతో అన్నం వడ్డించి ఆప్యాయంగా తినిపించారు. అన్నం తిన్న తర్వాత ఎక్కడ తంతారో అన్న భయంతో, ఆ దొంగ కళ్లనిండా నీళ్లు నింపుకుని ఏడుస్తూనే తింటున్న దృశ్యాలు చూసేవారికి నవ్వు తెప్పిస్తున్నాయి.

ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి అక్కడున్న ఒక పెద్దాయనను ఉద్దేశించి.. “దొంగను పట్టుకుని కొట్టకుండా ఇలా రాచమర్యాదలు చేసి భోజనం పెడుతున్నారేంటి తాతా?” అని అడిగాడు. దానికి ఆ తాత స్పందిస్తూ.. “ఒరేయ్… ఆకలితో వీడు ఏమైనా అయిపోతే ఎవరు సమాధానం చెబుతారురా? ప్రాణం పోయేదాకా ఆకలితో మాడ్చేయగలమా ఏంటి?” అంటూ చాలా సింపుల్‌గా బదులిచ్చాడు.

“ముందు కడుపునిండా తిండి పెడతాం.. ఆ తర్వాత పంచాయితీ సంగతి చూస్తాం” అంటూ గ్రామస్థులు సరదాగా మాట్లాడిన ఈ ఆత్మీయ వీడియో ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో 28 వేలకు పైగా వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: