జపాన్లో నమోదవుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు మనుషులను చల్లబరిచే ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్’ (మనిషి పట్టే ఫ్రిజ్)ను రూపొందించడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కూరగాయలు, ఆహార పదార్థాలను మాత్రమే ఫ్రిజ్లో ఉంచడం చూసిన మనకు.. మనుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘డో హిమోన్ బాక్స్’ (Do-Himon Box) ఎంతగానో విస్మయం కలిగిస్తోంది.
తీవ్రమైన ఎండ వేడిమి, వడదెబ్బతో అల్లాడే ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేలా ఈ బాక్స్ లోపల ఉష్ణోగ్రతను సుమారు 15°C వద్ద స్థిరంగా ఉంచుతారు. ఇందులో కేవలం 10 నిమిషాలు కూర్చుంటే చాలు.. శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గి, ఎండ తీవ్రత నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని తయారీ సంస్థ వెల్లడించింది.
భద్రత కోసం ఇందులో పలు ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. ఒక వ్యక్తి గరిష్టంగా 20 నిమిషాల పాటు వాడిన తర్వాత, శరీరం మరీ అతిగా చల్లబడకుండా ఉండేందుకు ఈ యంత్రం ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అంతేకాకుండా, దీనికి చక్రాలు అమర్చడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా తరలించవచ్చు; సాధారణ పోర్టబుల్ ఏసీతో పోలిస్తే ఇది సగం విద్యుత్ను మాత్రమే వినియోగిస్తుంది.
ఈ సరికొత్త అత్యాధునిక యంత్రం ధర సుమారు 1.5 మిలియన్ జపనీస్ యెన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 8 లక్షలు) ఉంటుందని అంచనా. ప్రస్తుతం దీనిని ప్రభుత్వ రంగ సంస్థలు, అత్యవసర సేవా విభాగాల కోసం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు; సాధారణ ప్రజల గృహ వినియోగానికి ఇంకా అందుబాటులోకి రాలేదు.
వడగాలుల నియంత్రణకు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే, త్వరలోనే దీనిని సాధారణ గృహ వినియోగదారుల కోసం కూడా విక్రయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సాంకేతికతలో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే జపాన్.. రోహిణీ కార్తెను తలపించే ఎండలను తట్టుకోవడానికి రూపొందించిన ఈ వినూత్న పరికరం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
