“ఒరేయ్! ఏం జరుగుతోంది అక్కడ..?” డబ్బుల వసూలు కోసం ట్రాన్స్‌జెండర్ల బాహాబాహీ.. పుణ్యక్షేత్రంలో రక్తపాతం.. భయంతో పరుగులు తీసిన జనం.. 7 మందిపై కేసు నమోదు..!!

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రాయణి నదీతీరంలో, భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసే విషయంలో రెండు ట్రాన్స్‌జెండర్ల వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర రక్తపాతానికి దారితీసింది. భక్తులు, స్థానికుల కళ్లముందే పట్టపగలు జరిగిన ఈ హింసాత్మక ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

ఇంద్రాయణి నది ఘాట్ వద్ద భక్తులు ఉన్న సమయంలో, సరిహద్దు దాటి డబ్బులు అడుగుతున్నారంటూ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ వాగ్వాదం కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకుంటూ, ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం.

ఈ ఘర్షణలో యోగేశ్ సతీశ్ ఘణమోతే అనే వ్యక్తి తలపై ఇనుప పంచ్ (నకిల్ డస్టర్)తో బలంగా కొట్టడంతో తల పగిలి రక్తం కారింది. అంతేకాకుండా ఈ తోపులాటలో అక్కడున్నవారి బంగారు గొలుసులు, మంగళసూత్రాలు, రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలంది పోలీసులు తక్షణమే కేసు నమోదు చేశారు. పరి యాదవ్, సనమ్, ఖుషి, రాణి, అంజలి సహా మొత్తం 7 మందిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ సంఘటన పోలీస్ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను సేకరించి పరిశీలిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: