ముంబైలోని విక్రోలి (Vikhroli) రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని, మరో యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రెప్పపాటులో రక్షించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి రైలు వస్తున్న సమయంలో, ఓ వ్యక్తి ట్రాక్ వైపు దూకేందుకు ప్రయత్నిస్తాడు. అది గమనించిన సమీపంలో ఉన్న మరో యువకుడు, ఏమాత్రం సంకోచించకుండా ముందుకు దూకి, రైలు అతడిని ఢీకొట్టడానికి కొన్ని సెకన్ల ముందు అతన్ని వెనక్కి లాగి కాపాడతాడు.
ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, ఆ యువకుడు కాపాడిన తర్వాత కూడా, ట్రాక్‌పై వెళ్తున్న రైలు చక్రాల కిందకు ఆ వ్యక్తి మళ్లీ తన కాలును పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ, కాపాడిన యువకుడు అతన్ని గట్టిగా పట్టుకుని, రైలు వైపు వెళ్లకుండా అడ్డుకుంటాడు.
ఈ ఘటన ముంబై విక్రోలి రైల్వే స్టేషన్లో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నప్పటికీ, ఇది ఏ రోజు జరిగింది, అందులో ఉన్న వ్యక్తులు ఎవరనే వివరాలు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఈ విషయంపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) దర్యాప్తు ప్రారంభించాయా లేదా అనే సమాచారం కూడా బయటకు రాలేదు.
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరొకరి ప్రాణాలను కాపాడిన ఆ యువకుడి మెరుపు లాంటి చర్యను ప్రశంసిస్తూ, నెటిజన్లు ఆ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply