మన దైనందిన ఆహారంలో అత్యంత ముఖ్యమైన మరియు పోషకమైన ఆహారం గుడ్డు. ప్రోటీన్ల భాండాగారమైన గుడ్డు మెజారిటీ ప్రజల అల్పాహారంలో అంతర్భాగంగా ఉంటుంది. అయితే, మనం తినే గుడ్ల నుండి పూర్తి పోషక విలువలు అందుతున్నాయా లేదా అనేది మనం తరచుగా ఆలోచించం.
గుడ్డును ఎలా ఉడికిస్తాం అనే దానిపైనే మన శరీరానికి అందే పోషకాలు ఆధారపడి ఉంటాయి. రుచికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అసలు పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ప్రకారం, సాధారణ గుడ్డును పేగులకు మేలు చేసే మరియు వాపును (Inflammation) తగ్గించే శక్తివంతమైన ఆహారంగా మార్చడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
డాక్టర్ సౌరభ్ తన యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఇలా వివరించారు: “గుడ్డు అంటే కేవలం ప్రోటీన్ మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా, నేను వీటిని పేగులకు మేలు చేసే విధంగా ఎలా మారుస్తానో ఇక్కడ చూడండి…”
- రెండు గుడ్లు: మెజారిటీ ప్రజలకు రోజుకు రెండు గుడ్ల పచ్చసొనలు (Yolk) తినడం సరిపోతుంది. గుడ్లలోని కొలెస్ట్రాల్ గురించి భయపడటం పాత పద్ధతి.
- పసుపు మరియు మిరియాల పొడి: పసుపులోని ‘కర్కుమిన్’ శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మిరియాల పొడిలోని ‘పైపెరిన్’ కలిసినప్పుడు మాత్రమే పసుపులోని గుణాలను శరీరం పూర్తిగా గ్రహించగలదు.
- కూరగాయలు: పాలకూర, టొమాటో, బెల్ పెప్పర్స్ (క్యాప్సికం) వంటి కూరగాయలను చేర్చడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచు పదార్థం (Fiber) అందుతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
- తక్కువ మంటపై వండటం: గుడ్లను మాడిపోయేలా వేయించకుండా, తక్కువ మంటపై మెత్తగా (Scrambled లేదా Omelet) వండటం వల్ల ప్రోటీన్లు మరియు కొవ్వుల నాణ్యత దెబ్బతినదు.
- ఆరోగ్యకరమైన కొవ్వులు: ఆలివ్ ఆయిల్, నెయ్యి లేదా అవోకాడో చేర్చడం వల్ల గుడ్డులోని విటమిన్ A, D, E, K లను శరీరం సులభంగా గ్రహిస్తుంది.
కన్సల్టెంట్ డైటీషియన్ గరిమా గోయల్ మాట్లాడుతూ.. ఉప్పును తగ్గించి పార్స్లీ, ఒరెగానో వంటి మూలికలను (Herbs) చేర్చడం వల్ల రుచితో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు.
