ఆదాయపు పన్ను చెల్లించే వేల మంది ఉద్యోగులకు ఐటీ శాఖ ఇటీవల పంపిన ఈమెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తప్పుడు వివరాలతో ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేసిన వారిని ప్రశ్నిస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని లేదా సవరించిన రిటర్న్ (Revised ITR) దాఖలు చేయాలని ఆదేశించింది.
ముఖ్యమైన హెచ్చరికలు:
- ఫామ్-16 వర్సెస్ ఐటీఆర్: మీరు దాఖలు చేసిన ఐటీఆర్ వివరాలకు, మీ కంపెనీ ఇచ్చిన ఫామ్-16 (Form 16) వివరాలకు మధ్య తేడాలు ఉంటే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది.
- కావాలనే తప్పులు: “మా మెయిల్‌కు వెంటనే స్పందించండి లేదా మీ రిటర్న్‌ను సరిచేసుకోండి. లేదంటే మీరు కావాలనే ఈ తప్పు చేసినట్లు భావించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని నోటీసులో స్పష్టం చేసింది.
- తప్పుడు మినహాయింపులు: హెచ్ఆర్ఏ (HRA), ఎడ్యుకేషన్ లోన్, మెడికల్ ఇన్సూరెన్స్ (80D) వంటి వాటిపై లేని మినహాయింపులను క్లెయిమ్ చేసిన వారిపై ఐటీ శాఖ డేగ కన్ను వేసింది.
విచారణ పరిధిలోకి వచ్చే క్లెయిమ్‌లు: ముఖ్యంగా చిన్న రాజకీయ పార్టీలకు లేదా ఛారిటబుల్ ట్రస్టులకు విరాళాలు ఇచ్చినట్లు చూపి పన్ను మినహాయింపు కోరిన వారిపై విచారణ జరుగుతుంది. అలాగే:
- ఆరోగ్య బీమా మరియు వైద్య ఖర్చులు (Section 80D, 80DDB).
- హౌస్ రెంట్ అలవెన్స్ (Section 10(13A)).
- విద్యా రుణం మరియు గృహ రుణ వడ్డీ.
- వాహనాల కొనుగోలుపై మినహాయింపులు (Section 80E, 80EE, 80EEB).
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రకారం, తప్పుడు ఆధారాలతో క్లెయిమ్ చేస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
