చైనాలో ఉన్న ‘నాన్జింగ్ హాంగ్షాన్ ఫారెస్ట్’ (Nanjing Hongshan Forest) జంతుప్రదర్శనశాలలో (జూలో), వెల్లకిలా పడిపోయి తిరిగి మామూలు స్థితికి రాలేక అల్లాడిపోయిన ఒక తాబేలును, సాటి తాబేలు పోరాడి కాపాడిన ఉద్వేగభరితమైన వీడియో ఇంటర్నెట్లో విడుదలై వైరల్ అవుతోంది.
ఒక తాబేలు ఊహించని విధంగా నేలమీద వెల్లకిలా పడిపోయి లేచి నిలబడలేక తీవ్ర అవస్థ పడింది.
తిరిగి నిలబడలేక, తన కాళ్లను పైకి గిలగిల కొట్టుకుంటూ ఆ తాబేలు చాలా సేపు పోరాడుతూనే ఉంది. దీన్ని దూరం నుంచి గమనించిన మరో తాబేలు, నెమ్మదిగా దాని వైపు కదిలి వచ్చింది. సహజంగానే నెమ్మదిగా నడిచే లక్షణం ఉన్న తాబేలు, తన స్నేహితుడిని కాపాడేందుకు ఎంతో ఓపికగా, పట్టుదలతో సహాయం చేయడం ప్రారంభించింది.
చాలా సేపు శ్రమించిన తర్వాత, వెల్లకిలా పడి ఉన్న ఆ తాబేలును తిరిగి దాని కాళ్లపై నిలబెట్టేందుకు తన శక్తినంతా కూడగట్టుకుని, తలతో ఢీకొట్టి బోర్లా తిప్పింది. సాటి తాబేలు చేసిన ఈ ప్రయత్నంతో వెల్లకిలా పడి ఉన్న తాబేలు మళ్లీ మామూలుగా నిలబడింది. ఇది చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి గురైన ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ (కేకలు వేస్తూ) తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Leave a Reply