కారులో సూదులు, మందులు.. ఇంట్లో సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం.. డాక్టర్ మృతిపై కొనసాగుతున్న మిస్టరీ!
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో 30 ఏళ్ల వైద్యుడు శివం కార్తికేయ కనిపించకుండా పోయారు. అయితే, ఒక రోజు తర్వాత మురాద్‌నగర్ సమీపంలోని ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిలిపి ఉంచిన ఆయన కారులో మృతదేహంగా కనిపించారు.
సెప్టెంబర్ 29న డాక్టర్ శివం కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు రోడ్డు పక్కన ఆయన కారు నిలిపి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కారును తనిఖీ చేయగా.. అందులో డాక్టర్ మృతదేహం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కారులో పలు సూదులు, మందులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయన అధిక మోతాదులో మందులు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, డాక్టర్ మరణానికి అసలు కారణం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టంగా నిర్ధారణ కాలేదు.
ఇదిలా ఉండగా, డాక్టర్ ఇంటి నుంచి ఓ సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. ఆ నోట్ నిజమైనదేనా? అందులో ఏముంది? దాని వెనుక కారణం ఏమిటనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అలాగే ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు.
అసలు డాక్టర్ ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు ఎందుకు వెళ్లారు? కారులో చివరిగా ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply